41వ రోజు విజయవంతంగా ప్రజా చైతన్య యాత్ర
1 min read– బడేటి రాధాకృష్ణయ్య (చంటి)
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు: ఏలూరు నగరంలో కొనసాగుతున్న గడపగడపకు కార్యక్రమంలో ప్రచార ఆర్భాటం తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కానరావడం లేదని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టి.డి.పి ఇంఛార్జి బడేటి చంటి విమర్శించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలను చైతన్యపరిచేందుకు ఆయన ప్రజా చైతన్యం పేరుతో చేపట్టిన పాదయాత్ర గురువారం స్థానిక 6వ డివిజన్ లోని సుంకరివారి తోట కనకదుర్గమ్మ గుడి దగ్గర నుండి ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించటంతో పాటు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముద్రించిన కరపత్రాలను బడేటి చంటి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి కూడా వీలులేకుండా సొంత డబ్బా కొట్టుకుంటూ అరచేతిలో వైకుంఠం చూపుతూ ప్రజాప్రతినిధులు గడపగడపకు లో వ్యవహారిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. నగరంలో గడిచిన మూడున్నరేళ్ళ ఎటువంటి అభివృద్ధి చేయకపోయినా చేసినట్లు ప్రజల్లో భ్రమ కల్పిస్తూ, పార్టీ శ్రేణులతో హడావిడి చేస్తూ ప్రభుత్వం పై ప్రజావ్యతిరేకత బయటపడకుండా నానా తంటాలు పడుతున్నారని బడేటి చంటి ఎద్దేవా చేశారు. ఎంత హడావిడి చేసినా రానున్న ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం లో టి.డి.పి గెలుపు ఖాయమని ఆయన పేర్కొన్నారు. వై.సి.పి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే టి.డి.పి నాయకుల పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.అన్నివర్గాల ప్రజలు ప్రభుత్వ తీరును, జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనను చూస్తున్నారని, రాష్ట్రంలో అపార్టీని భూస్థాపితం చేసేందుకు సన్నద్ధం గా ఉన్నారని బడేటి చంటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు జాలా బాలాజీ, డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ పైడి వెంకట్రావు,డివిజన్ ఇంచార్జ్ మాకాల రమేష్,మాజీ ఉపసర్పంచ్ చిన్ని అర్జున్ రావు తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Attachments area