పందికోన రిజర్వాయర్ నుండి 60 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ : హెచ్ ఎన్ ఎస్ ఎస్ పందికోన రిజర్వాయర్ నుండి 60 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలని బిజెపి జిల్లా కన్వీనర్ కే నీలకంఠ, పత్తికొండ నియోజకవర్గ కన్వీనర్ రంజిత్ కుమార్ కర్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పత్తికొండ పట్టణంలో రైతులతో కలిసి ర్యాలీ చేపట్టింది. పందికోన రిజర్వాయర్ కింద పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి, 60 వేల ఎకరాల భూములకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, స్థానిక గెస్ట్ హౌస్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు బిజెపి, దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ, ర్యాలీ చేపట్టారు. పందికోన రిజర్వాయర్ సామర్థ్యం కేవలం 1.4 టిఎంసిల సామర్థ్యం మాత్రమే అన్నారు. అయినప్పటికీ రిజర్వాయర్ లో ప్రస్తుతం కేవలం 0.4 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అసమర్థత వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా పందికోన రిజర్వాయర్ నీటి సామర్థ్యం పెంచి 60 వేల ఎకరాలకు సాగునీరు అందేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిత్యం కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి పందికోన రిజర్వాయర్ నీటి సామర్థ్యం పెంపు వలనే సాధ్యమవుతుందన్నారు. పందికోన రిజర్వాయర్ కింద ఎడమ, కుడి కాలువలు, పిల్ల కాలువల పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారు. ఈ మేరకు బిజెపి కార్యకర్తలు ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి కార్యాలయం ఎదుట బిజెపి నాయకులు, కార్యకర్తలు, రైతులు ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డిఓ రామలక్ష్మి కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. అలాగే బిజెపి నాయకుల బృందం పందికోన రిజర్వాయర్ కి చేరుకొని, అక్కడి రిజర్వాయర్ ను సందర్శించారు.