PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్.యు.సి.ఐ (కమ్యూనిస్ట్) పార్టీ 76వ సంస్థాపక సభ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్టు విప్లవ సాధనకై ఉద్యమిస్తున్న ఎస్.యు.సి.ఐ (కమ్యూనిస్టు) పార్టీ 76వ సంస్థాపక దినం సందర్భంగా ఈరోజు కర్నూల్ నగర కమిటీ ఆధ్వర్యంలో నగర కార్యాలయం నందు సంస్థాపక సభను నిర్వహించారు.ఈ సభకు నగర కార్యదర్శి ఎం. తేజోవతి గారు అధ్యక్షత వహించారు. అనంతరం ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ కే సుధీర్ గారు మాట్లాడుతూ నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను పెట్టుబడిదారుల కొరకు తప్ప మరేమీ కాదని అన్నారు ఈ ప్రభుత్వాల పాలకులు అంబానీ అదాని వంటి కార్పోరేట్ కంపెనీలకు పొలిటికల్ మేనేజర్లుగా తయారయ్యారని దుయ్యబట్టారు ప్రపంచ కుబేరుల జాబితాలోకి అక్రమ మార్గాలలో అమాంతంగా ఎగబ్రాకిన అదాని వెనుక మోడీ ప్రభుత్వం అండదండలు ఉన్న విషయం బట్టబయలైందని అన్నారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారీ అనుకూల – ప్రజా వ్యతిరేక విధానాల వలన నేడు దేశంలో మునుపెన్నడూ లేనంతగా ఆర్థిక సామాజిక అసమానతలు తీవ్రంగా పెరిగిపోయాయని, నిరుద్యోగం తాండవిస్తోందని కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు కాకపోగా ఉన్నవి కూడా మూతపడుతూ వేలాదిమంది కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారని అన్నారు. మరోవైపు వ్యవసాయం దెబ్బతిని రైతుల ఆత్మహత్యలు, పట్టెడన్నం దొరకక ఆకలి చావులు, వైద్యం అందక అకాల మరణాలు నిత్యం సంభవించే సంఘటనలు అయ్యాయని తెలిపారు. గౌరవప్రదమైన బ్రతుకుతెరువు కానరాక వేలాది మంది మహిళలు పడుపు వృత్తిలోకి నెట్టి వేయబడుతున్నారని, మహిళలపై, ప్రత్యేకించి పసిప్రాయంలోని ఆడపిల్లలపై జరుగుతున్న అమానుష అత్యాచారాలు అత్యంత భయాందోళనలు కలిగించేలా ఉన్నాయని అన్నారు. ఇంకోవైపు ఇలాంటి వాస్తవ సమస్యల నుండి ప్రజల దృష్టిని పక్కకు మళ్ళించడానికి రకరకాల నినాదాలతో మతోన్మాదాన్ని, జాతి దురహంకారాన్ని, కుల వైషమ్యాలను ప్రేరేపించేలా ప్రభుత్వ పథకాలు ఉన్నాయని విమర్శించారు. అధికార మదంతో ప్రజల ప్రజాస్వామ్య హక్కులను హరించివేయడం, మందబలంతో నిరసించే గొంతులను నులిమివేయడం దేశంలో పెరుగుతున్న ఫాసిజానికి ప్రతిరూపమయ్యాయని అన్నారు. అన్నిటికి మించి మనిషిలోని హేతుబద్ధ ఆలోచనలను నీతి నైతిక విలువలను మానవసారాన్ని చంపివేసే విధంగా పాఠ్య పుస్తకాల్లో మార్పులు తీసుకొచ్చే ఫాసిస్ట్ కుట్ర కొనసాగుతుందని చెప్పారు. ఇలాంటి అన్ని సమస్యల పరిష్కారం కొరకు ప్రజలందరూ ఉద్యమంలోకి రావడమే పరిష్కార మార్గమని, ఈ పరిస్థితులలో నిజమైన వామపక్ష ఉద్యమ పతాకాన్ని సమ్మునతంగా నిలబెడుతూ కమ్యూనిస్టు సిద్ధాంతం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెబుతూ దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై ఉద్యమాలను నిర్మిస్తోందని, పార్టీ నిర్మించే ఉద్యమాలలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్చార్జి వి. హరీష్ కుమార్ రెడ్డి సభ్యులు నాగన్న, ఖాదర్, శ్రీమాన్, రోజా, మల్లేష్, బాబు తదితరులు పాల్గొన్నారు.

About Author