9 ఏళ్ల బాలిక నైపుణ్యానికి ఆపిల్ సీఈవో ఫిదా !
1 min readపల్లెవెలుగువెబ్: 9 ఏళ్ల భారతీయ బాలిక ఐఓఎస్ యాప్ తయారుచేసి అందరినీ ఔరా అనిపించింది. దుబాయ్ లో ఉండే ఈ బాలిక టెక్నాలజీని ఔపోసన పట్టి యాప్ తయారుచేసిన తీరు పట్ల ఐఫోన్ తయారీదారు ఆపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ కూడా విస్మయం చెందారు. ఆ బాలిక పేరు హనా మహ్మద్ రఫీక్. తనపేరు కలిసి వచ్చేలా ‘హనాస్’ అనే కథల యాప్ ను ఆమె రూపొందించింది. ఈ యాప్ లో చిన్నారుల తల్లిదండ్రులు కథలను రికార్డు చేయవచ్చు. ఐఓఎస్ ప్లాట్ ఫాంపై ఈ యాప్ ను ఉచితంగా పొందవచ్చు. కాగా తాను యాప్ తయారుచేసిన వైనాన్ని హనా… ఈమెయిల్ ద్వారా టిమ్ కుక్ కు వివరించింది. ఐదేళ్ల వయసు నుంచే తాను కోడింగ్ నేర్చుకుంటున్నానని, ఈ క్రమంలో ఓ యాప్ రూపొందించిన అత్యంత పిన్న వయస్కురాలిని తానే అని భావిస్తున్నానని తెలిపింది. దీనిపై ఆపిల్ సీఈవో టిమ్ కుక్ స్పందించారు. హనా… ఇంత చిన్నవయసులోనే నీ ఘనతలు ఆకట్టుకునేలా ఉన్నాయి, ఎంతో ప్రశంసనీయం అని కొనియాడారు. ఈ నైపుణ్యాన్ని ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో అద్భుతాలు సృష్టిస్తావని శుభాకాంక్షలు తెలిపారు.