31న సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 9 వ వార్షికోత్సవం
1 min read
రాయలసీమ పట్ల ఎన్డీఏ ప్రభుత్వ వివక్ష విడనాడాలి.
కర్నూలు, న్యూస్ నేడు: రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో సమితి కార్యవర్గ సభ్యులు పట్నం రాముడు అధ్యక్షతన కార్యాచరణ సమావేశం రామకృష్ణ డిగ్రీ కళాశాల సమావేశ మందిరం, నంద్యాలలో మంగళవారం నాడు జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం పది సంవత్సరాల కాలంలో, రాయలసీమ అన్ని రంగాల్లో మరింత వివక్షకు గురైన సందర్భంలో రాయలసీమ బాటన ఎన్డీఏ ప్రభుత్వం నిలబడుతుందన్న ఆశలను వమ్ము చేసే విధంగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాయలసీమ సమగ్రాభివృద్ధికి పాలకులపై ఒత్తిడి పెంచే దిశగా కార్యక్రమాలను చేపట్టాలని ముఖ్య అతిథిగా పాల్గొన్న రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు. సిద్దేశ్వరం అలుగు తొమ్మిదో వార్షికోత్సవాన్ని మే 31న ఘనంగా నిర్వహించుకుంటూ, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూల్ లో ఏర్పాటు, సుమారు 1000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి పనులు చేపడితే రాయలసీమలో సుమారు నాలుగున్నర లక్ష ఎకరాల ఆయకట్టు వచ్చే ఖరీఫ్ సీజన్ కు స్థిరీకరణకు చేసే అవకాశాన్ని చేపట్టాలని, ప్రాంతీయ పరిశోధనా స్థానం నుండి కలెక్టరేట్ కార్యాలయం తక్షణమే తొలగింపు తదితర రాయలసీమ అభివృద్ధికి చేపట్టాల్సిన వివిధ అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా కార్యాచరణ చేపట్టాల్సిన ఆవశ్యకతను ప్రతినిధులకు ఆయన వివరించారు. రాయలసీమ అభివృద్ధికి సంబంధించిన వివిధ రంగాలలో విద్యా, వైద్య, ఆరోగ్య,వ్యవసాయ, సాగునీటి, ఉద్యోగ రంగాలలో జరుగుతున్న వివక్షపై ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణ పై ఒక స్పష్టమైన కార్యాచరణను ప్రతినిధుల ముందు ఆయన ఉంచారు. రాయలసీమ పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరిని తొలగించే దిశగా రెండు లక్షల మంది స్వచ్ఛందంగా సిద్దేశ్వరం అలుగు తొమ్మిదో వార్షికోత్సవంలో పాల్గొనేదిశగా చేపట్టే కార్యాచరణను విజయవంతం చేయాలని బొజ్జా పిలుపునిచ్చారు. .విశిష్ట అతిథిగా పాల్గొన్న మానవ వనరుల శిక్షకులు గజ్జల రవీందర్ రెడ్డి సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులను ఉద్యమంలో భాగస్వామ్యంలో అవడానికి మరియు రాయలసీమ కార్యాచరణ విజయవంతం చేయడానికి ఉన్న అనేక అవాంతరాలను తొలగించుకునే దిశగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ప్రతినిధి ఒక ఉద్యమ నాయకుడిగా ఎదగడానికి అయినా వివరించిన తీరు, అవలంబించిన పరస్పర చర్చలు ప్రతినిధులను విశిష్టంగా ఆకర్షించాయి. నంద్యాల జిల్లాలోని సుమారు 18 మండలాల ప్రతినిధులు చాలా ఉత్సాహంగా అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందిస్తూ రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని ప్రతి ఇంటికి చేర్చే కార్యాచరణ కార్యక్రమాన్ని విధిగా చేపడుతామని పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించి మే 31 న నిర్వహించే సిద్దేశ్వరం అలుగు ప్రజాసంకు స్థాపన తొమ్మిదవ వార్షికోత్సవాన్ని విజయవంతం చేస్తామని స్పష్టమైన ప్రకటనలు చేసారు. ఈ కార్యక్రమంలో వివిధ మండల ప్రతినిదులతో పాటుగా, రాయలసీమ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వైన్ రెడ్డి వందన సమర్పణ తో కార్యక్రమం చేపట్టారు.