NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంగళగిరి నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన

1 min read

నూతన యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

వాహనశాల, గంటా మండపం పునర్నిర్మాణం

శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణకు భూమిపూజ

రూ.6.3 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి లోకేష్

మంగళగిరి, న్యూస్ ​నేడు:  ప్రముఖ పుణ్యక్షేత్రం మంగళగిరి దిగువ సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జీర్ణోద్ధరణ పనులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నూతన యాగశాల నిర్మాణంతో పాటు వాహనశాల, గంటా మండపం పునర్నిర్మాణం, శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆలయ అధికారులు ఏర్పాటుచేసిన నమూనా చిత్రాలను పరిశీలించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని, రాజ్యలక్ష్మీ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేదాశీర్వచనం చేసిన స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

రూ.6.3 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం

దేవాదాయ శాఖ నిధులు రూ.6.3 కోట్ల వ్యయంతో శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణతో పాటు యాగశాల, గంటా మండపం, వాహనశాల పునర్నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా దేవాలయం మొత్తం కలియతిరిగిన మంత్రి నారా లోకేష్ అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు కావాల్సిన వసతులు, ఆలయ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం కల్పించడంతో పాటు నిత్యప్రసాదానికి చర్యలు తీసుకోవాలన్నారు. పుష్కరిణిని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అందరితో కలిసి ఫోటోలు దిగారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్, ఆలయ ఈవో కోగంటి సునీల్ కుమార్, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులతో పాటు పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీ దేవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

About Author