NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆస్టర్ క్వాలిటీ కేర్ ప్రస్థానం ప్రారంభం

1 min read

మెట్రోలకే పరిమితం కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలకూ అధునాతన వైద్యం

 ఆస్టర్ డీఎం, క్వాలిటీ కేర్ ఇండియా విలీనం పూర్తి

 39 ఆసుపత్రులు, 10,600 పడకలతో దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌గా అవతరణ

హైదరాబాద్, న్యూస్​ నేడు: ప్రముఖ వైద్య సేవల సంస్థలు ‘ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్’, ‘క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ (QCIL)’ల విలీన ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఈ రెండు సంస్థల కలయికతో ఏర్పడిన నూతన ఉమ్మడి సంస్థ ‘ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్’ తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించింది. దీని ద్వారా దేశీయ వైద్య రంగంలో విశ్వసనీయ బ్రాండ్లయిన ఆస్టర్ డీఎం, కేర్ హాస్పిటల్స్, ఎవర్‌కేర్, కిమ్స్‌హెల్త్ (KIMSHEALTH)లు ఒకే గొడుగు కిందికి వచ్చాయి. ఈ నూతన సంస్థకు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా డాక్టర్ ఆజాద్ మూపెన్, మేనేజింగ్ డైరెక్టర్ (MD) & గ్రూప్ సీఈఓగా వరుణ్ ఖన్నా వ్యవహరించనున్నారు.దేశంలో కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన కార్పొరేట్, అధునాతన తృతీయ, చతుర్థ శ్రేణి (టెర్షియరీ, క్వాటర్నరీ) వైద్య సేవలను దేశంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించడమే లక్ష్యంగా ఈ విలీనం జరిగినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. దక్షిణాది, మధ్య భారత దేశాల్లో బలమైన నెట్‌వర్క్ కలిగిన ఈ నూతన సంస్థ.. ప్రస్తుతం 28 నగరాల్లో 39 ఆసుపత్రులు, 10,600 కంటే ఎక్కువ పడకల సామర్థ్యంతో కార్యకలాపాలు సాగిస్తోంది. ముఖ్యంగా వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న నాగ్‌పూర్, ఔరంగాబాద్, విజయవాడ, గుంటూరు, భువనేశ్వర్, రాయ్‌పూర్, నాగర్‌కోయిల్, కొల్హాపూర్ వంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది. తద్వారా స్థానిక రోగులు సంక్లిష్టమైన చికిత్సల కోసం మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని సంస్థ పేర్కొంది.రోబోటిక్ సర్జరీ సౌకర్యాలను రాయ్‌పూర్, తిరువనంతపురం, కొల్హాపూర్‌తో పాటు త్వరలోనే విజయవాడ, గుంటూరు నగరాలకూ విస్తరించనున్నారు. క్యాన్సర్ రోగుల కోసం గామా నైఫ్, జ్యాప్ (ZAP) వంటి అత్యాధునిక రేడియో సర్జరీ వ్యవస్థలతో పాటు రానున్న రోజుల్లో శస్త్రచికిత్సల కోసం 10 రోబోటిక్ ప్లాట్‌ఫారమ్‌లు, 12 కొత్త లీనాక్ (LINAC) ఆధారిత రేడియేషన్ థెరపవ్యవస్థలను అందుబాటులోకి తేనున్నారు. రాబోయే కొద్ది సంవత్సరాల్లో పడకల సంఖ్యను 15,000 పైగా పెంచాలని సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది.

సరికొత్త మైలురాయి: డాక్టర్ ఆజాద్ మూపెన్

“ఆస్టర్, క్వాలిటీ కేర్ సంస్థల కలయిక భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా వైద్య సేవలందించే ఒక గొప్ప మైలురాయి” అని ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ ఆజాద్ మూపెన్ వ్యాఖ్యానించారు. క్లినికల్ నైపుణ్యం, రోగుల సంరక్షణ పట్ల అంకితభావం కలిగిన రెండు సంస్థలు ఏకం కావడం ద్వారా దేశంలో మారుతున్న ఆరోగ్య అవసరాలను సమర్థంగా తీర్చగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రోగుల సంరక్షణే తొలి ప్రాధాన్యం: వరుణ్ ఖన్నా

సంస్థ ఎండీ, గ్రూప్ సీఈఓ వరుణ్ ఖన్నా మాట్లాడుతూ, “ఈ విలీనంతో వైద్య రంగంలో అత్యుత్తమ పద్ధతులు, డిజిటల్ టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు రోగులకు అందుబాటులోకి వస్తాయి. మా తక్షణ ప్రాధాన్యత అంతా రోగులకు ఎక్కడా అంతరాయం లేని నిరంతర నాణ్యమైన చికిత్స అందించడంపైనే ఉంటుంది” అని తెలిపారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో 45,000 మందికి పైగా వైద్య నిపుణులు సేవలందిస్తున్నారని, భవిష్యత్ విస్తరణ ద్వారా డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి వేలాది కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు.(గమనిక: విలీన ప్రక్రియ అనంతరం అధికారికంగా పేరు మార్పునకు సంబంధించిన సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ సంస్థ ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ లిమిటెడ్‌గా కొనసాగుతోంది).

About Author