NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి భావితరాలకు చిరస్మరణీయం

1 min read

ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం : జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్.

స్వేచ్ఛ, ఆత్మగౌరవం, దేశభక్తి, త్యాగం వంటి ఉన్నత విలువలకు అల్లూరి సీతారామరాజు ప్రతీక.

దేశాభివృద్ధి, సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయడమే అల్లూరి సీతారామరాజుకు అందించే నిజమైన నివాళి.

కర్నూలు,న్యూస్​ నేడు: స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా నేడు జిల్లా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడని పేర్కొన్నారు. బ్రిటీష్ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా గిరిజనులను సంఘటితం చేసి, వారి హక్కుల పరిరక్షణ కోసం అసాధారణ ధైర్యసాహసాలతో పోరాడిన గొప్ప నాయకుడిగా అల్లూరి చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.స్వేచ్ఛ, ఆత్మగౌరవం, దేశభక్తి, త్యాగం వంటి ఉన్నత విలువలకు అల్లూరి సీతారామరాజు ప్రతీక అని జాయింట్ కలెక్టర్ తెలిపారు. స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగం, చూపిన అంకితభావం నేటికీ ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తోందని చెప్పారు. సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.నేటి యువత అల్లూరి సీతారామరాజు ఆశయాలను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, నిజాయితీ, దేశభక్తి, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం మాత్రమే కాకుండా, వారు కలలుగన్న సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధి, సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయడమే అల్లూరి సీతారామరాజుకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సెట్కుర్ సీఈవో వేణుగోపాల్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అధికారి సురేష్, ట్రైబల్ వెల్ఫేర్ సలహామండలి డైరెక్టర్ వెంకటపతి, గిరిజన సంఘం నాయకులు కైలాస్ నాయక్, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author