పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనువైన రాష్ట్రం: మంత్రి టీజీ భరత్
1 min read
పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం.. పెట్టుబడుల నుంచి ఉత్పత్తి వరకు ప్రభుత్వమే భాగస్వామి
బెంగళూరులో ఆంధ్రప్రదేశ్.. పెట్టుబడులు అవకాశాలను కలిసే వేదిక’ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్
బెంగళూరు, న్యూస్ నేడు: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనువైన రాష్ట్రంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీ.జీ భరత్ అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. బెంగళూరులోని లీలా ప్యాలెస్ హోటల్‌లో భారతీయ పరిశ్రమల సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి సంయుక్తంగా నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్.. పెట్టుబడులు అవకాశాలను కలిసే వేదిక’ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొని ప్రసంగించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు, అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రభుత్వం వారికి భాగస్వామిగా నిలుస్తుందని చెప్పారు. పెట్టుబడిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా వ్యవస్థను మారుస్తున్నామని తెలిపారు. పెట్టుబడిదారుల సమయం ఎంతో విలువైనదని, అనుమతుల్లో జరిగే ప్రతి ఆలస్యం పెట్టుబడిపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఒప్పందాలు చేసుకోవడంతో ప్రభుత్వ బాధ్యత ముగియదని, ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఉత్పత్తి, విస్తరణ, ఎగుమతుల వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.పరిశ్రమలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. అనుమతులు ఆలస్యం కావడం, మౌలిక వసతుల కొరత, విధానాల్లో మార్పులు వంటి అంశాలను తెలియజేస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఈడీబీ సీ.ఈ.ఓ షణ్మోహన్, సీఐఐ కర్ణాటక వైస్ చైర్మన్ సామ్ చెరియన్, జే.కే మెయిని ప్రీసియన్ టెక్నాలజీస్ యం.డి గౌతమ్ మెయిని, హెచ్‌ఎఫ్‌సీఎల్ లిమిటెడ్-డిఫెన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్సంపత్ కుమారన్ ఎస్.టి. తదితరులు పాల్గొన్నారు.



