నిత్యావసరాల ధరలు తగ్గించాలని సిపిఎం ధర్నా
1 min read
కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలపై నిత్యవసర ధరల భారం.
సిపిఎం మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర రెడ్డి.
ప్రజలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిత్యవసర బాదుడే బాదుడు. సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర
న్యూస్ నేడు, పత్తికొండ: నిత్యావసర ధరలు రోజురోజుకూ పెరుగుతూ పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా చోద్యం చూస్తోందని సీపీఎం, సీఐటీయూ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో పత్తికొండ పట్టణంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు.స్థానిక కామ్రేడ్ ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి భవనం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా నాలుగు స్తంభాల వద్దకు చేరుకుంది. అక్కడ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ కార్యదర్శి నరసన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి, సీఐటీయూ మండల కార్యదర్శి ఎం. రవిచంద్రలు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలపై ధరల బాదుడు మరింత పెరిగిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో నిత్యావసర ధరలను తగ్గిస్తామని హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీలను గాలికి వదిలేసిందని విమర్శించారు. వంటింటి ఖర్చులు పెరిగిపోవడంతో పేద కుటుంబాలు అర్ధాకలితో జీవించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.కూరగాయలు, పప్పులు, నూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని ఘాటుగా విమర్శించారు.


