ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యకు ఏడాది పూర్తి
1 min read
గణనీయంగా పెరిగిన విద్యార్థుల ప్రతిభ
ఉపాధ్యాయులకు శిక్షణ, విద్యార్థులకు గణితం, సైన్స్‌లో ఉచిత డిజిటల్ అభ్యసన వనరులు – పాఠశాల విద్యాశాఖ, ఖాన్ అకాడమీ
కరీంనగర్, న్యూస్ నేడు : కరీంనగర్ లో గణితం, సైన్స్ విద్యను డిజిటల్ వనరులతో మరింత బలోపేతం చేసే దిశగా పాఠశాల విద్యాశాఖ, ఖాన్ అకాడమీ ఇండియా చేపట్టిన రాష్ట్రవ్యాప్త కార్యక్రమం తొలి ఏడాదిలోనే కీలక మైలురాయిని చేరుకుంది. 2025–26 విద్యా సంవత్సరంలో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 9 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఉచిత డిజిటల్ అభ్యసన వనరులు అందుబాటులోకి వచ్చాయి.తెలంగాణ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి శ్రీ ఎ. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమం జూన్ 2025లో ప్రారంభమైంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని దాదాపు 6 వేల పాఠశాలల్లో సుమారు 20 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (KGBV), మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, సొసైటీ పాఠశాలలు, ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు ఈ కార్యక్రమంలో భాగమయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం పాఠశాలల్లో దాదాపు 75 శాతం వరకు కార్యక్రమం విస్తరించింది.విద్యార్థులు గణితం, సైన్స్‌లో క్రమం తప్పకుండా సాధన చేసేలా పాఠశాల విద్యాశాఖ వారపు ఆన్‌లైన్ అభ్యసన మార్గదర్శకాలను అమలు చేసింది. ముఖ్యంగా సైన్స్ అభ్యసనంపై విద్యార్థులు ఆసక్తి చూపడం గమనార్హం.ఖాన్ అకాడమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ స్వాతి వాసుదేవన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ నాయకత్వం, SCERT సహకారం, జిల్లా అధికారులు, పాఠశాలల నాయకులు, ఉపాధ్యాయుల కృషి వల్ల ఈ విజయాన్ని సాధించామని తెలిపారు.ప్రస్తుత విద్యా సంవత్సరంలో కార్యక్రమాన్ని మరింత విస్తరించడంతోపాటు విద్యార్థుల అభ్యసన నాణ్యత, క్రమబద్ధమైన వినియోగంపై దృష్టి సారించనున్నారు. జిల్లా నోడల్ అధికారులు వారపు పర్యవేక్షణ ద్వారా పాఠశాలలకు అవసరమైన సహకారం అందించనున్నారు.


