పూర్వోదయ పథకంతో రాయలసీమ అభివృద్ధికి లక్ష కోట్ల పెట్టుబడులు
1 min read
హొళగుందలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన కార్యక్రమాన్ని వీక్షించిన అధికారులు, కూటమి నాయకులు, రైతులు
హొళగుంద న్యూస్ నేడు: రాయలసీమ చరిత్రను తిరగరాసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన పూర్వోదయ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో సాంకేతికతను పెంపొందించి, రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు కార్యాచరణ చేపట్టినట్లు మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోకదళ్ తెలిపారు.పూర్వోదయ పథకంలో భాగంగా మూడు దశల్లో ప్రభుత్వ నిధులు రూ.40,352 కోట్లు, ప్రైవేటు రంగం నుంచి రూ.60 వేల కోట్ల పెట్టుబడులతో మొత్తం లక్ష కోట్ల రూపాయల అభివృద్ధి ప్రణాళికను రూపొందించినట్లు ఆయన వివరించారు. ఈ పథకం ద్వారా భవిష్యత్తులో 10 జిల్లాల్లోని 201 క్లస్టర్లు, 5,869 గ్రామాలకు ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు.శుక్రవారం మదనపల్లెలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్–ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమాన్ని హొళగుంద మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా అధికారులు, నాయకులు, రైతులు వీక్షించారు.మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోకదళ్, టీడీపీ మండల కన్వీనర్ తిప్పయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో సయ్యద్ ఉమర్, ఎస్ఐ దిలీప్ కుమార్, బీజేపీ, జనసేన నాయకులు, రైతులు పాల్గొన్నారు.


