కరవు సీమను సిరులసీమగా మారుస్తాం…
1 min read
ఉద్యానరంగ అభివృద్ధితో ఆర్ధికాభివృద్ధి
అగ్రికల్చర్ స్కూల్ ద్వారా వ్యవసాయ రంగంలో నైపుణ్యాలు పెంచుతాం
కేంద్ర సాయంతో రాష్ట్రాభివృద్ధి-ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సహకారాన్ని మరువలేం
గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన సభలో సీఎం చంద్రబాబు
రూ. లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు శ్రీకారం
రిలయెన్స్ సంస్థ భాగస్వామ్యంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు శంకుస్థాపన
మదనపల్లెలో రెండు బృహత్తర ప్రాజెక్టులకు అంకురార్పణ చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
గోదావరి-కావేరి నదుల అను సంధానికి అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరిన సీఎం చంద్రబాబు
తనను ఆంధ్రప్రదేశ్ బిడ్డగా భావించ మని సీఎంను కోరిన అనంత్ అంబానీ
అనంత్ అంబానీ ఏపీ ముద్దుబిడ్డ అంటూ ముఖ్యమంత్రి ఆలింగనం
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి :కరవుసీమగా పేరున్న రాయల సీమను సిరుల సీమగా మారు స్తామని ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2024 ఎన్నికల్లో కూటమిని గెలిపించిన మరుక్షణం నుంచి ప్రజలకు మేలు చేయాలనే తలంపుతో ఉన్నామని దాంట్లో భాగంగానే రాయల సీమలోని ఎనిమిది జిల్లాలు, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని ఉద్యాన రైతులకు మేలు చేసేలా గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శ్రీకారం చుట్టామని చెప్పారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ, మంత్రి నారా లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ను అభివృద్ధి చేయనున్నారు. కేంద్ర సహకారంతో రూ.40 వేల కోట్లు, ప్రైవేటు పెట్టుబడులతో మరో రూ.60 వేల కోట్లను సమీకరించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అన్న మహాత్మాగాంధీ ఆశయాన్ని సాకారం చేసే దిశగా రాయలసీమలో చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకారంతో కరవుసీమను రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఉద్యాన రంగం ప్రాథమిక రంగం వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని, ప్రస్తుతం సుమారు రూ.1.50 లక్షల కోట్ల జీవీఏ అందిస్తున్న ఈ రంగం ద్వారా మరో రూ.లక్ష కోట్ల జీవీఏను సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. ఈ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా 5,860 గ్రామాలను 201 క్లస్టర్లుగా అభివృద్ధి చేయడంతో పాటు అదనంగా 6 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగును విస్తరించేలా ఈ ప్రాజెక్టులో కార్యాచరణ చేపట్టనున్నామన్నారు. రైతులకు ఉత్పత్తి నుంచి మార్కెటింగ్, ప్రాసెసింగ్, ఎగుమతుల వరకు సమగ్ర మద్దతు అందించడమే హార్టికల్చర్ హబ్ ప్రధాన ఉద్దేశమని సీఎం చంద్రబాబు చెప్పారు. పంటల స్థిరీకరణతో పాటు ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. యాపిల్, స్ట్రాబెరీ నుంచి అరటి, ఆవకాడో, కివీ, ఖర్జూరం వరకు వివిధ రకాల ఉద్యాన పంటలకు ప్రోత్సహం అందించనున్ననట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రిటెక్, లాజిస్టిక్స్, అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలను అభివృద్ధి చేసి రైతులకు మేలు చేసే వ్యవస్థలను అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సీడ్ టు షిప్మెంట్ వ్యవస్థల ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించేలా కార్యక్రమాలను అమలు చేయను న్నామని సీఎం వెల్లడించారు.
-సాగునీరందిస్తాంబంగారం పండించండి :
సాగునీరు అందిస్తే రాయలసీమ ప్రజలు బంగారం పండిస్తారని, మార్కెటింగ్ ద్వారా సంపద సృష్టిస్తారని సీఎం పేర్కొన్నారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని, రూ.3,500 కోట్లతో హంద్రీ-నీవా కాలువను పూర్తి చేసి కుప్పం వరకు నీటిని తీసు కెళ్లామని చెప్పారు. వెలిగొండ మొదటి దశను పూర్తి చేసి మార్కాపురానికి, పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి నీటిని అందించామని వివరించారు. మరో రూ.35 వేల కోట్లతో 36 ప్రాధాన్య ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం తెలిపారు. రాయలసీమలో హంద్రీ-నీవా, మడకశిర బ్రాంచ్ కెనాల్, మల్లెమడుగు, బాలాజీసాగర్, అప్పర్ పేరూరు తదితర ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో వంటి పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంలో సవాళ్లు పెరుగుతున్నాయని సీఎం అన్నారు. గోదావరిలో ఈ ఏడాది కూడా సుమారు 1,600 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందని, పట్టిసీమ ద్వారా పదేళ్లలో సుమారు 500 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలించామని తెలిపారు. కృష్ణా డెల్టాలో పొదుపు చేసిన నీటిని రాయలసీమకు తరలించడం నదుల అనుసంధానం వల్లే సాధ్యమైందన్నారు. వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని సీఎం తెలిపారు. పవర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, డిజిటల్ కనెక్టివిటీ మాదిరిగా వాటర్ గ్రిడ్ అవసరమని చెప్పారు. గోదావరి నుంచి కావేరి వరకు నీటిని అనుసంధానం చేసే అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. గోదావరి-కావేరి అనుసంధానంతో రాయలసీమ కరవు తీరడంతోపాటు… దక్షిణాదిలోని 4 రాష్ట్రాల మధ్య నెలకొనే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. రిలయన్స్ సంస్థ సహకారంతో మదనపల్లెలో ఏర్పాటు కానున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా వ్యవసాయం, ఉద్యానవనం, ఆధునిక సాంకేతికత, పరిశోధన, కృత్రిమ మేధ వంటి రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించేలా ఈ సంస్థను తీర్చిదిద్దనున్నట్టు వెల్లడించారు. ఐఐఎంలో మేనేజ్మెంట్ నిపుణులు, ఐఐటీలో సాంకేతిక నిపుణులు, ఐఎస్బీలో పారిశ్రామిక నైపుణ్యాలు అభివృద్ధి చెందినట్లే.. ఐఎస్ఏ ద్వారా వ్యవసాయ రంగంలో నాయకత్వ నైపుణ్యాలు కలిగిన నిపుణులను తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఉక్కు మహిళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి, దేశ మౌలిక సదు పాయాల ప్రాజెక్టులకు అందిస్తున్న సహకారాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమరావతి, విశాఖ ఉక్కు, పోలవరం తదితర ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోందన్నారు. దేశ నిర్మాణంలో నిర్మలా సీతారామన్ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. జీఎస్టీ నెక్స్ట్‌జెన్ సంస్కరణలు, డీబీటీ ద్వారా సంక్షేమ పథకాల్లో పారదర్శకత, ఆర్థిక వ్యవస్థలో సంస్కరణల ద్వారా దేశాన్ని బలోపేతం చేస్తున్న ఉక్కు మహిళ నిర్మలా సీతారామన్ అని సీఎం అన్నారు. ఓ మహిళే ఇంటిని చక్కగా తీర్చిదిద్దే సత్తా మహిళకు మాత్రమే ఉంటుందని.. అదే విధంగా దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మలా సీతారామన్ తీర్చిదిద్దుతున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆమెకున్న నాయకత్వ పటిమను గుర్తించే ప్రధాని మోదీ ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారన్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు నిధులు కేటాయించే విషయంలో నిర్మలా సీతారామన్ చూపిన చొరవను.. ఇచ్చిన సహకారాన్ని మరువలేమన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయిలో అభివృద్ధి-సంక్షేమం చేయగలుగుతోందంటే దానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తన పెద్ద మనస్సును చాటుకున్నారన్నారు. వ్యవసాయం, ఉద్యాన రంగాల్లో పరిశోధన, ఆధునిక సాంకేతికత, ఏఐ వినియోగంతో పాటు రైతులకు అవసరమైన మద్దతు వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో రిలయన్స్ సంస్థ సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. సీడ్ టు షిప్మెంట్, అగ్రిటెక్, లాజిస్టిక్స్, అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో మరింతగా భాగస్వామ్యం కావాలని సూచించారు. తిరుమల శ్రీవారిపై భక్తితో ఈవీ బస్సులను సమకూర్చిన అనంత్ అంబానీ సేవలను సీఎం ప్రస్తావించారు. అలాగే అనంత్ అంబానీ వంతారా వంటి వ్యవస్థను ఏర్పాటు చేసి జంతువులకు సైతం సేవలు అందిస్తున్న గొప్ప పర్యావరణ ప్రేమికుడు అనంత్ అంబానీ అని కొనియాడారు. అనంత్ అంబానీ తన తాత, తండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని వారి బాటలో నడుస్తున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు.
ప్రత్యేక ఆకర్షణగా అనంత్ అంబానీ :
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌తో తన అనుబంధాన్ని చాటుకుంటూ భావోద్వేగంగా ప్రసంగించారు. తనను ఆంధ్రా బిడ్డగా భావించాలని, రాష్ట్రానికి తాను ఏం చేయగలనో మార్గనిర్దేశం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యక్రమంలో ఆయన ప్రసంగం ఆకట్టుకుంది. అనంత్ అంబానీ ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆయనను అభినందించారు. అనంతరం సీఎం చంద్రబాబు అనంత్ అంబానీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రసంగించిన ముఖ్యమంత్రి అనంత్ అంబానీ చెప్పిన మాటలను స్పందించారు. అనంత్ అంబానీని ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డగా భావిస్తున్నామని సీఎం వేదికపై ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధిలో రిలయన్స్ సంస్థ మరింతగా భాగస్వామి కావాలని ఆకాంక్షించారు. ఈ సమావేశం సందర్భంగా సభలో వక్తల ప్రసంగాలకు ముందు ప్రత్యేక వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. రాయలసీమలో ఉద్యాన రంగం అభివృద్ధి, రైతుల ఆదాయ పెంపు, నీటి వనరుల వినియోగం, ఆధునిక సాగు విధానాలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతుల అవకాశాలను ఈ వీడియోలో వివరించారు. కార్యక్రమం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మొక్కలను నాటారు. అలాగే ఉద్యాన రంగానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.



