PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు..!

1 min read

– సాగునీటి ప్రాజెక్టుల పై.. చర్చకు సిద్ధమా..!
– వైసీపీకి సవాల్​ విసిరిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: జిల్లాలో పంటలకు సాగునీరు విడుదల చేయకుండా రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని , సాగునీటి ప్రాజెక్టులు ధనార్జనే ధ్యేయంగా.. వైసీపీ నాయకులకు పాడి గేదెలుగా మారాయని ధ్వజమెత్తారు బీజేపీ రాష్ట్ర నాయకులు, రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బై రెడ్డి రాజశేఖర్​ రెడ్డి. నాగటూరు ఎత్తిపోతల కింద ఉన్న ఆయకట్టు భూములకు సాగునీరు అందించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బుధవారం కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం లోని సాగునీటి ప్రాజెక్టు నాగటూరు ఎత్తిపోతల పథకం, ఎండి పోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరుస కరువులతో రైతాంగం నలిగిపోతోందన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన మొక్కజొన్న, మినుము, పత్తి , పంటలు సాగునీరు అందక దెబ్బతిన్నాయన్నారు. ఫలితంగా రైతులు రూ.లక్షలు నష్టపోయారన్నారు. 2003లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం జీఓ నం. 145ను తీసుకొచ్చి… నాగటూరు ఎత్తిపోతల పథకం అభివృద్ధికి కృషి చేశామని, ఫలితంగా నియోజకవర్గం లోని జూపాడుబంగ్లా, నందికొట్కూరు, పగిడ్యాల మండలంలోని 9800 ఎకరాలను సస్యశ్యామలం చేశామన్నారు. ప్రస్తుతం నీటిపారుదల శాఖ అధికారులు బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్నారని, సాగునీరు సరఫరాకు ట్రాన్స్​ఫార్మర్​ కాలిపోయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడం సిగ్గు చేటన్నారు. రూ.5లక్షలు ఖర్చు చేస్తే ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతులు పూర్తి చేయవచ్చు కానీ ఆ డబ్బులు కూడా ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి చేతకాదా అని ప్రశ్నించారు.

నందికొట్కూరు రైతుల.. ధౌర్భాగ్యం..
మల్యాల ఎత్తిపోతల, ముచ్చుమర్రి ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు నుండి ఇతర జిల్లాలకు సాగునీరు సరఫరా చేస్తోందని, కానీ నందికొట్కూరు రైతులు నీరు వాడుకోలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందన్నారు బైరెడ్డి రాజశేఖర్​ రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో దొందూ దొందుగా వ్యవహరిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. నందికొట్కూరు నియోజకవర్గం లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నియోజకవర్గ భాద్యులు నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, కొండెపోగు సుంకన్న, రవికుమార్ రెడ్డి, నాయుడు, కాటే పోగు చిన్న నాగన్న, జయరాముడు, తదితరులు పాల్గొన్నారు.

About Author