NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్​యూలో  బోధనేతర సిబ్బంది శిక్షణా కార్యక్రమం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ఉద్యోగులు తమనైపుణ్యాలకు మెరుగులు దిద్దుకున్నపుడే తమ బాధ్యతలను సరైనరీతిలో నిర్వహించగలుగుతారని రాయలసీమ మరియు క్లస్టర్ విశ్వవిద్యాలయాల వి.సి. ఆచార్య వి. వెంకట బసవరావు అభిప్రాయపడ్డారు. రాయలసీమ మరియు క్లస్టర్ విశ్వవిద్యాలయాల సంయుక్త ఆధ్వర్యంలో ఆర్.యు. సెనేట్ హాలులో నేటినుండి మూడురోజులపాటు కొనసాగనున్న బోధనేతర సిబ్బంది శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్సిటీ పాలనకు సంబంధించిన వివిధ అంశాలపై విషయ నిపుణులు అందించే సూచనలు, సలహాలను అవగాహన చేసుకుంటే ప్రతి ఉద్యోగి పురోగతి సాధించే అవకాశం ఉంటుందన్నారు. మూడు రోజులపాటు, ఏడు సెషన్లలో జరిగే శిక్షణను సద్వినియోగం చేసుకోవలసినదిగా ఆయన సూచించారు. కర్నూలు నగరంలోనే ఉన్న మూడు విశ్వవిద్యాలయాల్లో అందుబాటులోఉన్న కోర్సులను సమీక్షించుకుని ఆచరణయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటే విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆచార్య బసవరావు సూచించారు. ఈ-ఆఫీస్, ఈ-ఫైలింగ్ మొదలైన విషయాలమీద ఉద్యోగులకు సరైన అవగాహన ఉండాలన్నారు. నేటి కాలంలో నేర్చుకోవడమనేది ఏ మాత్రం ఐచ్ఛికం కాదని, అది తప్పనిసరి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమానికి స్వాగతం పలికిన రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి. విజయకుమార్ నాయుడు శిక్షణా కార్యక్రమ వివరాలను తెలియజేస్తూ, లక్ష్యాలను వివరించారు. ప్రారంభ సమావేశం ముగిసిన అనంతరం జరిగిన శిక్షణా కార్యక్రమం తొలి సెషన్లో రోజువారీ కార్యాలయ వ్యవహారాలు, అప్పటికప్పుడు ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవలసిన విధానాన్ని గురించి, రిపోర్టులు తయారుచేయడం మొదలైన జనరల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఆఫీస్ మేనేజిమెంట్ విషయాలగురించి ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ పూర్వ డైరెక్టర్ జనరల్, విశ్రాంత ఐఎఎస్ అధికారి డి. చక్రపాణి వివరించారు. మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో పరిపాలనకు అకడమిక్ పరిపాలనకు ఉన్న తేడాను డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విశ్రాంత డిప్యూటీ రిజిస్ట్రార్ శేషగిరిరావు వివరించారు. అకడమిక్ ప్రోగ్రాంలు, వాటికి సంబంధించిన మార్కులు, క్రెడిట్లు, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన మొదలైన అంశాలపై బోధనేతర ఉద్యోగులకు అవగాహన కల్పించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *