NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మేయర్ నామినేషన్ కు 24 గంటల ముందే ఆర్టీసీ జోనల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశా

1 min read

వైసీపీ ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దు

హైకోర్టు కేసును కొట్టివేసింది

వైసీపీ ప్రత్యర్థులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు

రేపటితో ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా  నగరంలో భారీ ర్యాలీ నిర్వహణ

మీడియా సమావేశంలో నగర మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు

ఏలూరుజిల్లా ప్రతి నిధి,న్యూస్ నేడు: ఏలూరు నగర మేయర్ పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి 24 గంటల ముందే ఏపీఎస్‌ఆర్టీసీ జోనల్ చైర్మన్ పదవికి తాను రాజీనామా చేసినట్లు ఏలూరు కూటమి మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. రాజీనామా ప్రక్రియకు కొంత సమయం పట్టడాన్ని ఆసరాగా చేసుకుని, ప్రత్యర్థి పార్టీలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఈ వ్యవహారంపై ప్రత్యర్థులు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ న్యాయస్థానం కేసును కొట్టివేసిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, రాజీనామా పత్రంపై ఎండీ సంతకం, అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద ఆమోదం పొందేందుకు సుమారు నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ పరిపాలనా ప్రక్రియలో జరిగే ఆలస్యాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటూ కొంతమంది వైసీపీ ప్రత్యర్థులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. ఎన్నికల ముందు రాజీనామా చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఎన్నికల అనంతరం రాజీనామా చేస్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని, ఎన్నికల కమిషన్ తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలంటే, ప్రజల సమస్యలపై అవగాహన ఉండాలని, వాటి పరిష్కారానికి కృషి చేసే నిబద్ధత అవసరమని ఆయన అన్నారు. మా ప్రత్యర్థులు ప్రజా సమస్యలపై చర్చించకుండా, దుష్ప్రచారాలతో ఓటర్లను తప్పుదోవ పట్టించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు.స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి 62 డివిజన్లలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నామని రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. నగరంలో జరుగుతున్న ప్రచార కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో, వైసీపీ ప్రత్యర్థులు తనపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇటువంటివి అసత్య దుష్ప్రచారాలు ఇకనైనా మానుకోవాలని ఆయన తీవ్రస్థాయిలో ప్రత్యర్థులకు హెచ్చరించారు.

ప్రచార ముగింపు సందర్భంగా భారీ బైక్ ర్యాలీ

ఏలూరు నగరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగియనున్న నేపథ్యంలో, అదే రోజు వన్‌టౌన్‌లోని పాండురంగ థియేటర్ వద్ద నుంచి జనసేన పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఈ ర్యాలీలో కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. ప్రచార ముగింపు కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించేందుకు కూటమి శ్రేణులు సిద్ధం కావాలని కోరారు. వచ్చే నెల 1వ తేదీన జరగనున్న ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓటు వేసే సమయంలో మేయర్ అభ్యర్థికి సంబంధించిన పింక్ కలర్ బ్యాలెట్‌ను, కార్పొరేటర్ అభ్యర్థులకు సంబంధించిన వైట్ కలర్ బ్యాలెట్‌ను గుర్తించి, ఆయా బ్యాలెట్లపై కూటమి అభ్యర్థులకు కేటాయించిన గుర్తులపై ఓటు వేయాలని కోరారు. మీడియా సమావేశంలో జనసేన సీనియర్ నాయకులు నారా శేషు, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా,నాయకులు రెడ్డి గౌరీ శంకర్,ఎట్రించి ధర్మేంద్ర, బోండా రామునాయుడు, బొత్స మధు, అల్లు సాయి చరణ్,జనసేన రవి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *