రామాయణ సందేశం మానవాళి మనుగడకు దిక్సూచి
1 min read
డా. దోనేపూడి నరేశ్ బాబు
గుంతనాలలో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు,న్యూస్ నేడు: శ్రీమద్రామాయణం కేవలం ఒక గ్రంథం మాత్రమే కాదని, అది ఒక జీవన విధానమని, శ్రీరాముడు ఆదర్శ కుమారుడిగా, ఆదర్శ భర్తగా, ఆదర్శ రాజుగా ఎలా జీవించాలో మానవాళికి చూపించారన్నారు. ఇటువంటి కలియుగంలో మానవ సంబంధాలు, నైతిక విలువలు క్షీణిస్తున్న తరుణంలో రామాయణంలోని ధర్మం, త్యాగం, సత్యం అనే విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని, ఆచరించాల్సిన అవసరం ఉందని ప్రముఖ ధార్మిక ప్రవచకులు డాక్టర్ దోనెపూడి నరేశ్ బాబు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నంద్యాల మండలం, గుంతనాల గ్రామంలోని శ్రీరామాలయం నందు ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీమద్రామాయణంపై ధార్మిక ప్రవచనం చేశారు. తదనంతరం స్థానిక భజన మండలి నిర్వహించిన భజన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ రామాయణ సందేశాన్ని అర్థం చేసుకుంటేనే మానవాళి మనుగడ సుస్థిరంగా ఉంటుందని, అదే మానవాళికి దిక్సూచి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు ప్రతిరోజు స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, శుక్రవారం ప్రత్యేకంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అర్చకులు తాటిపాటి గిరిధర శర్మ, భజన బృందం సభ్యులు గాలి జగదీశ్వర్ రెడ్డి, కె. సి గురువిరెడ్డి, బీరం వెంకట సుబ్బారెడ్డి, ఎస్. వీర నాగేశ్వరప్ప, దేశం వెంకటరెడ్డి, పి. శివరాముడు, గాలి రవీంద్రారెడ్డి, వి. సాయిబాబా, టి. శివలక్ష్ముమ్మ, గోవర్ధన్, కె. నాగమణెమ్మ, బి. ఓబులమ్మ, బి.శివమ్మ, ఎస్.వీరమ్మ, గాలి పుల్లమ్మ, టి. దేవమ్మ, వెంకట సుబ్బమ్మతోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


