ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో నవంబర్ 5న స్థానిక సెలవు
1 min read
జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు: ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో నవంబర్ 5న స్థానిక సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ రోజైన నవంబర్ 5న స్థానిక సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సెలవు ఎన్నికల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 ప్రకారం కూడా పోలింగ్ రోజున సెలవు వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా పోలింగ్ కేంద్రాలుగా వినియోగిస్తున్న ప్రభుత్వ, విద్యాసంస్థల భవనాలు మరియు ఇతర భవనాలకు నవంబర్ 4 (పోలింగ్ ముందు రోజు), నవంబర్ 5 (పోలింగ్ రోజు), నవంబర్ 7 (కౌంటింగ్ రోజు) సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని, ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కలెక్టర్ కోరారు.


