అభ్యర్థుల ఎంపికపై సిద్ధార్థ రెడ్డి కసరత్తు
1 min read
నాయకులకు దిశా నిర్దేశం..
నందికొట్కూరు న్యూస్ నేడు:రానున్న పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వివిధ గ్రామాల నాయకులతో కసరత్తు చేస్తున్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో గత రెండు రోజుల నుండి పార్టీ కార్యాలయంలో నాయకులకు అందుబాటులో ఉంటూ అన్ని వర్గాల సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని గ్రామ నాయకులు ప్రజల అభీష్టం మేరకు సరైన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.అంతేకాకుండా సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వివిధ గ్రామాల నాయకులకు కార్యకర్తలకు సిద్ధార్థ రెడ్డి సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు. గత మూడు రోజుల క్రితం మరణించిన వడ్డెమాన్ వైసిపి నాయకులు జంగం కోటయ్య కుటుంబాన్ని సిద్ధార్థ రెడ్డి పరామర్శించారు.తర్వాత మండ్లెం గ్రామంలో జరిగిన వివాహ కార్యక్రమానికి ఆయన హాజరై వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు వై చంద్రమౌళి,లింగాపురం మాజీ సర్పంచ్ నాగార్జున రెడ్డి,వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.



