రెండో రోజు ప్రశాంతంగా కొనసాగిన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ
1 min read
ఎల్లార్తి, చిన్నహ్యాట, నెరణికి, సులువాయి, ముద్దటమాగి తదితర గ్రామాల నుంచి అభ్యర్థుల నామినేషన్లు
మండలంలో ఇప్పటివరకు 59 సర్పంచ్, 120 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు – ఎంపీడీవో సయ్యద్ ఉమర్
హొళగుంద, న్యూస్ నేడు: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో హొళగుంద మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండో రోజు సోమవారం ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆశావహులు ఉత్సాహంగా ముందుకు వచ్చి సంబంధిత నామినేషన్ కేంద్రాల్లో తమ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. దీంతో మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.ఎల్లార్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థిగా ఎం. ఫకృమ్మ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె కుమారుడు ఎం. మహబూబ్ బాషా పాల్గొన్నారు. ఇదే గ్రామానికి చెందిన బోయ తిమ్మప్ప సతీమణి బోయ సునీత, బోయ మల్లికార్జున సతీమణి లక్ష్మి కూడా తమ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.చిన్నహ్యాట గ్రామ పంచాయతీ పరిధిలో వీరేంద్ర సతీమణి జి. అరుణ నామినేషన్ దాఖలు చేయగా, నెరణికి గ్రామానికి చెందిన మల్లికార్జున, నెరణికి తాండకు చెందిన రాజేష్ నాయక్ కూడా నామినేషన్లు సమర్పించారు. సమ్మతగేరి పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో సులువాయి గ్రామానికి చెందిన రాఘవేంద్ర చౌదరి సతీమణి శ్రీవాణి తన నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు.
59 సర్పంచ్, 120 వార్డు సభ్యుల నామినేషన్లు
హోళగుంద న్యూస్ నేడు:హొళగుంద మండలంలో ఇప్పటివరకు మొత్తం 59 సర్పంచ్ నామినేషన్లు, 120 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో సయ్యద్ ఉమర్ వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పటిష్ట పోలీసు బందోబస్తు
నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఎన్నికల నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు చేపట్టారు. రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మొత్తంగా రెండో రోజు నామినేషన్ల దాఖలుతో హొళగుంద మండలంలోని గ్రామాల్లో రాజకీయ సందడి మరింత పెరిగింది. రానున్న రోజుల్లో మరింత మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉండటంతో గ్రామ పంచాయతీ ఎన్నికలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.



