నందికొట్కూరులో … నకిలీ కొబ్బరి నూనె
1 min readరూ.69 వేల విలువ గల సరుకు పట్టివేత..
ఇద్దరి పై కేసునమోదు..పరారీలో మరి కొందరు..
పల్లెవెలుగువెబ్, నందికొట్కూరు: కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కేంద్రంగా సాగుతున్న నకిలీ కొబ్బరి నూనె వ్యాపారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. నకిలీ కొబ్బరి నూనెను విక్రయిస్తున్న ఇద్దరు వ్యాపారస్తుల ను అదుపులోకి తీసుకోగా మరికొందరు పరారీలో ఉన్నారు. వ్యాపారుల నుంచి సుమారు రూ.69 వేలు విలువగల సరుకును స్వాధీనం చేసుకొని కేసునమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ లో గల మహాదేవ్ నావేల్టి జనరల్ దుకాణం,పగిడ్యాల రోడ్డులో సుధా కిరాణ జనరల్ దుకాణం, వాసవి భవనం సమీపంలో గల కనుమూరి ట్రేడర్స్ లో పారాచూట్ కంపెనీ పేరుగల నకిలీ కొబ్బరి నూనె విక్రయాలు జోరుగా సాగిస్తున్నట్లు బెంగుళూరు పారాచూట్ కంపెనీ కి చెందిన సౌత్ ఏరియా మేనేజర్ సోమసుందరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనితో నందికొట్కూరు పోలీసులు శుక్రవారం రాత్రి పట్టణంలోని పలు దుకాణాలలో సోదాలు చేశారు. పోలీసుల సోదాలలో భారీ ఎత్తున నకిలీ కొబ్బరి నూనె బాటిళ్లు దొరికాయి. మూడు దుకాణాలలో కలిపి 500యంఎల్,200యంఎల్ ,150యంఎల్,50 యం.ఎల్ గల 1822 బాటిళ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుకాణ యజమానులు ప్రజా పత్ తేజో రామ్, అంగడి ఈశ్వరయ్యను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచినట్లు పట్టణ ఎస్ఐ కె. పి.బి. వెంకటరెడ్డి తెలిపారు. మరికొందరు నిందితులు పరారీ లో ఉన్నారన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.