మాతృమరణాలు.. ఉండకూడదు..
1 min read– గర్భిణీలను వెంటనే గుర్తించి.. మెరుగైన వైద్య చికిత్స అందిద్దాం..
–అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్. వినోద్ కుమార్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: జిల్లాలో మాతృమరణాలు ఉండకూడదని.. గ్రామాల్లో గర్భిణీలను గుర్తించి వారికి మెరుగైన వైద్యచికిత్సలు శరవేగంగా అందించాలని సూచించారు అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్. వినోద్ కుమార్. శనివారం కర్నూలు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలోని సమావేశ భవనంలో
మాతృమరణాల నియంత్రణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశములో ప్రసూతి విభాగ నిపుణులు డాక్టర్ స్నేహ, డాక్టర్ రమ్యశ్రీ మరియు ICDS సూపర్ వైసర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశలు పాల్గొన్నారు. ఈ నెలలో గార్గేయపురం, క్రిష్ణగిరి, దేవనకొండ మరియు పట్టణ ఆరోగ్య కేంద్రం వడ్లపేట (ఆత్మకూరు)లో జరిగిన 4 మాతృమరణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్. వినోద్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలలో ఆశా, ఆరోగ్య కార్యకర్తలు త్వరగా గర్భవతులను గుర్తించి మాత శిశు సంరక్షణ కార్డ్ లో నమోదు చేసి, గర్భిణీలను తీసుకొనివచ్చి రక్తపోటు, మధుమేహం, రక్తహీనత పరీక్షలు చేయించి, వైద్యాధికారితో తప్పనిసరిగా 4 చెకప్ లు చేయించాలని హై రిస్క్ గర్భవతిని గుర్తించి రెఫెరల్ ఆసుపత్రులకు తీసుకెళ్ళి మెరుగైన చికిత్సలు అందే విధముగా కృషి చేయాలని తెలిపారు. సమావేశంలో డి.పి.హ్.యన్.ఓ సెక్షన్ సిబ్బంది శివరంజిని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశలు పాల్గొన్నారు.