విద్యావిధానంలో మార్పులు తీసుకురావాలి :ఎస్టీయూ
1 min readపల్లెవెలుగు వెబ్, పత్తికొండ: విద్యాశాఖ విద్యా విధానంపై అవలంబిస్తున్న తీరు… విద్యా ప్రమాణాలు పడి పోయే విధంగా ఉన్నాయని ఎస్టియు రాష్ట్ర కౌన్సిలర్ కుంపటి సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. సోమవారం పత్తికొండ ఎస్టియు భవన్ లో మండల గౌరవ అధ్యక్షులు బీరప్ప అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా బోధన చేయాల్సిన ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించడం పిల్లల విద్యకు విఘాతం కలుగుతుందన్నారు. ఉదయం నుండి సాయంత్రం దాకా ఉపాధ్యాయులు ఫోటోలు తీసి యాప్ లలో డౌన్లోడ్ చేయడానికి సమయం సరిపోతుందని, చదువు చెప్పడానికి సమయం ఎక్కడ ఉంటుందని ఆయన వాపోయారు . ఉదయం నుండి టాయిలెట్, యూరినల్, మధ్యాహ్న భోజన ఫోటోలు అప్లోడ్ చేయడానికి, జగనన్న కిట్ల పంపిణీ చేయడం, విద్యార్థుల అడ్మిషన్లు ఎక్కించడం లాంటి పనులకే ఉపాధ్యాయులు సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుందని అన్నారు . ఉపాధ్యాయులు ఉదయం పాఠశాలకు వచ్చినప్పటినుండి బయోమెట్రిక్ వేయడానికి పోరాటం చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ యాప్ ల గోల తగ్గించి చదువు చెప్పడానికి సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు .ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుండి విముక్తి చేయాలని బోధన చేయడానికి సమయం కల్పించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎస్టియు రాష్ట్ర కౌన్సిలర్ కొత్తపల్లి సత్యనారాయణ జిల్లా ఆర్థిక కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి ఎస్టియు మండల నాయకులు నాయకులు సంజీవయ్య, రాఘవేంద్ర, చెన్నకేశవరావు, గోవర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.