గొర్రెల సహకార సంఘం ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలి: కురువ సంఘం
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు : కర్నూలు జిల్లాలో ప్రాథమిక గొర్రెల సహకార సంఘం ఎన్నికలను ప్రజాస్వామ్యబధ్ధంగా నిర్వహించాలని కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంకే.రంగస్వామి డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు సాంద్ర గొర్రెల అభివృద్ది విభాగం సహాయ సంచాలకులు చంద్రశేఖర్ ను కలిసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎంకే.రంగస్వామి మాట్లాడుతూ జిల్లాలో 269సంఘాల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా జరిపించాలన్నారు. గతంలో చాలా చోట్ల ఎవరికి సమాచారం ఇవ్వకుడా ఎన్నికలు జరిపారనీ, ఈసారి వచ్చే నెలలో నిర్వహించే ఎన్నికలను సంఘం సభ్యులకు తెలిపి గ్రామాల్లోనే ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. సంఘం సభ్యులకు ప్రభుత్వం వచ్చే అన్ని పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంసీ రంగన్న, నరసింహులు పాల్గొన్నారు.