వైద్యులు..కనిపించే దేవుళ్లు..
1 min read– టీజీ వెంకటేష్, రాజ్యసభ సభ్యులు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : మనిషి ప్రాణాలకు భరోసానిచ్చే వైద్యులే కనిపించే దేవుళ్లని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎంతోమందికి పునర్జన్మను ప్రసాదిస్తున్న వైద్యుల రుణం ఎన్ని జన్మలైత్తినా తీర్చుకోలేమన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎ.క్యాంప్ లోని హెల్త్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాజ్య సభ సభ్యులు టీజీ వెంకటేష ముఖ్ అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి శరీరంలోని అవయవాల్లో గుండె ప్రాధాన్యత ఎనలేనిదని, గుండె ఆరోగ్యం పై ఏమాత్రం నిర్లక్ష్యం కనబరిచినా జీవితం ముగిసినట్టేనన్నారు. ఆరోగ్యం తీవ్రంగా విషమించిన పరిస్థితుల్లో అప్పటి అవసరాన్ని బట్టి గుండె పనిచేయడాన్ని పూర్తిగా నిలిపివేసి తిరిగి పనిచేయించగల సత్తా కర్నూలు వైద్యుల సొంతమని ప్రశంసించారు. అనంతరం హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ టీజీ వెంకటేష్ సహకారంతో తమ ఫౌండేషన్ కర్నూలులో హెల్త్ క్లబ్ నిర్మించగలిగిందన్నారు. గుండె జబ్బుల పట్ల కర్నూలు ప్రజల్లో అవగాహన కల్పించడంలో తాము నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ డా.ఆంజనేయులు , స్థానిక వైద్యులు డా. భవాని ప్రసాద్, డా. వసంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.