హంద్రీనీవాకు.. విద్యుత్ కష్టాలు..
1 min read– ప్రాజెక్టు విద్యుత్ బకాయి రూ.317కోట్లు..
– ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం బకాయి రూ.57 కోట్లు..
– ప్రాజెక్టులకు విద్యుత్ ను నిలిపివేస్తామంటున్న అధికారులు..
– రెండు రోజుల గడువు కోరిన నీటిపారుదల శాఖ..
పల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు హంద్రీనీవా సుజల స్రవంతి పథకం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, నందికొట్కూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ , మున్సిపాలిటీ కార్యాలయం విద్యుత్ బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. ఎత్తిపోతల పథకాల బకాయి బిల్లులు కోట్లలో ఉండడంతో జిల్లా వ్యాప్తంగా జలమండలి శాఖల కార్యాలయాలలో గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సరఫరాను నిలిపి వేయాలని నందికొట్కూరు విద్యుత్ శాఖ ఏడి శ్రీనివాసులు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న జల మండలి అధికారులు విద్యుత్ శాఖ అధికారులతో చర్చించారు. బకాయిలు చెల్లించేందుకు రెండు రోజుల గడువు కావాలని కోరినట్లు విద్యుత్ శాఖ ఏఈ మధన్ మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఏఈ మధన్ మోహన్ మాట్లాడుతూ విద్యుత్ బిల్లుల బకాయి 2019,2020, 2021సంత్సరాలలో ఇప్పటి వరకు హంద్రీ నీవా ఎత్తిపోతల పథకం విద్యుత్ బకాయిలు రూ.317 కోట్లు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం విద్యుత్ బిల్లుల బకాయి రూ.57 కోట్లు ఉన్నాయన్నారు. అలాగే నందికొట్కూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ విద్యుత్ బిల్లుల బకాయి రూ.4కోట్లు, నందికొట్కూరు మున్సిపాలిటీ విద్యుత్ బిల్లుల బకాయి రూ. 10లక్షలు ఉన్నట్లు తెలిపారు. నందికొట్కూరు, పగిడ్యాల, మిడుతూరు మండలంలోని గ్రామ పంచాయతీలలో దాదాపు రూ.30కోట్ల బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. బకాయిలు చెల్లించాలని ఆయా శాఖల అధికారులకు సమాచారం ఇచ్చిన ఇప్పటివరకు చెల్లించక పోవడంతో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు పలు ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా ను నిలిపి వేశారు.