రాష్ట్రంలో డ్రగ్స్ మాటే రాకూడదు! హోంశాఖతో సీఎంజగన్ సమీక్ష
1 min readపల్లెవెలుగువెబ్, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడా డ్రగ్స్ అనే మాట వినిపించకూడదని సీఎం జగన్ హోంశాఖను ఆదేశించారు. సోమవారం ఆయన సీఎం కార్యాలయంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌సవాంగ్, సీఎస్ సమీర్‌వర్మ, పోలీసుశాఖ ఉన్నత యంత్రాంగంతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. దేశంలో పలురాష్ట్రాల్లో డ్రగ్స్ వ్యవహారం విస్తృతంగా ఉండడంతో ఏపీలో ఎక్కడా ఆ పరిస్థితులు కనిపించకుండా ఉండేలా సీఎం జగన్ ముందస్తు దృష్టి సారించారు. రాష్ట్రంలో కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లే లేకుండా చర్యలు తీసుకోవాలని హోంశాఖను ఆదేశించారు. అక్రమ మద్యం తయారీ, రవాణా, ఇసుక అక్రమ రవాణా వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించి చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు. దశచట్టం అమలు, మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు వంటి నేరాలపై సమగ్ర విచారణ, పోలీసునిఘా బలోపేతం, డ్రగ్స్ నియంత్రణ వంటి అంశాలపై సీఎం సమీక్షించారు. ఇటీవల ఏపీకి డ్రగ్స్ రవాణా అవుతున్నాయన్న అంశం ఒక్కసారిగా ప్రభుత్వ వర్గాల్లో వేడిపుట్టించింది. కాగా తాజాగా ముంబైలో ఎన్సీబీ అధికారులు సముద్రయానంలో ఓ నౌకలో జరుగుతోన్న రేవ్‌పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తోన్న కొందరిని అదుపులోకి తీసుకోవడం, ఇందులో బాలివుడ్ హీరో షారూక్ కుమారుడు ఆర్యన్ పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఈక్రమంలో ఏపీ సీఎం జగన్ హోంశాఖతో ప్రత్యేకంగా సమీక్షించడం ప్రాధాన్యత సంతరించుకుంది.