11న తిరుమలకు సీఎం జగన్! పర్యటన ఏర్పాట్లపై తితిదే ఈవో సమీక్ష
1 min readపల్లెవెలుగువెబ్, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల జరుగుతోన్న దృష్ట్యా ఏపీ సీఎం జగన్ ఈనెల 11వ తేదీన తిరుమల రానున్నారు. ఈమేరకు సీఎం పర్యటన ఏర్పాట్లపై తితిదే ఈవో కెఎస్.జవహర్‌రెడ్డి శుక్రవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణతో కలిసి సమీక్షించారు. తిరుమల అన్నమయ్య భవన్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో సీఎం పర్యటించే ప్రాంతాలు, పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు, ఏర్పాట్లపై చర్చించారు. సీఎం జగన్ 11వ తేదీ మధ్యాహ్నం తిరుపతి చేరుకుని అక్కడ బర్డ్ వైద్యశాలలో వేంకటేశ్వర పిడియాట్రిక్, కార్డియాక్ విభాగాలను ప్రారంభిస్తారు. అనంతరం అలిపిరి కాలినడక మార్గం పైకప్పు, అలిపిరి పాదాల మండప వద్ద గోమందిరాన్ని ప్రారంభిస్తారు. తదుపరి తిరుమల చేరుకుని సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సంప్రదాయబద్ధంగా పట్టువష్ట్రాలు సమర్పిస్తారు. మరునాడు 12వ తేదీ శ్రీవారి దర్శనం అనంతరం ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లను, నూతన లడ్డూపోటును ప్రారంభిస్తారు. సీఎం ఏర్పాట్లను ఆయా ప్రాంతాలోల తితిదే అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి, జేఈవో సదాభార్గవి, జేఈవో వీరబద్రయ్యలు పర్యవేక్షిస్తారు.