అమ్మ ఒడితో పిల్లల్లో బడిబాట స్ఫూర్తిని పెంచాలి! సీఎం జగన్
1 min readపల్లెవెలుగువెబ్, అమరావతి: అమ్మ ఒడి పథకంతో పిల్లల్లో బడిబాట స్ఫూర్తిని పెంచాలని సీఎం జగన్ అన్నారు. పిల్లలు బడిబాట పట్టాలన్న లక్ష్యంతోనే అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చామని, తల్లిదండ్రులతోపాటు పిల్లలను సైతం చైతన్యవంతం చేయాలని విద్యాధికారులకు సూచించారు. సోమవారం సీఎం. జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి పథకం, విద్యాకానుక అమలు వంటి అంశాలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ ప్రాబల్యం తగ్గుముఖం పడుతోన్న క్రమంలో క్రమేణా విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోందని అధికారులు సీఎం. జగన్‌కు వివరించారు. అమ్మ ఒడి పథకం లబ్దికి విద్యార్థుల హాజరు కనీసం 75శాతం తప్పనిసరి అనే నిబందన పెట్టినా… కరోనా ప్రభావ పరిస్థితుల నేపథ్యంలో అధి సాధ్యం కాలేదని సీఎం అభిప్రాయపడ్డారు. అయితే కరోనా తగ్గుముఖం నేపథ్యంలో విద్యార్థుల హాజరు శాతం 91శాతానికి పెరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో సీబీఎస్ఈ అఫిలియేషన్ తీసుకరావాలని అధికారులు సూచించారు. 2024నాటికి విద్యార్థులు సీబీఎస్ఈ పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఉన్నత పాఠశాలకు క్రీడా మైదానం ఉండాలని స్పష్టం చేశారు. క్రీడా మైదానాలు లేని పాఠశాలకు భూసేకరణ చేపట్టాలన్నారు. విద్యార్థులకు క్రీడల పట్ల మక్కువ పెరిగేలా స్పోర్ట్స్ డ్రెస్, స్పోర్ట్స్‌తోపాటు రెగ్యులర్‌గా ఉపగపడే షూస్‌ను అందించాలన్నారు. సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గన్నారు.