జత టమోటా గంపల ధర @ 1000
1 min read–అమాంతంగా పెరిగిన టమోటా ధర
– ఆనందంలో రైతులు
పల్లెవెలుగు వెబ్, పత్తికొండ:టమోటా ధరకు రెక్కలొచ్చాయి. మూడు నెలల కిందట కిలో టమోటా ధర 30 పైసలు పలికింది. ఈ క్రమంలో తీవ్ర ఆందోళనలో ఉన్న రైతుల ఆశలకు రెక్కలొచ్చాయి. మంగళవారం జత టమోటా గంపల ధర రూ.1000 పలకడంతో రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది.
టమోటా ధరలకు రెక్కలు..
కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఎక్కువ మంది రైతులు టమోటా పంటను సాగు చేస్తున్నారు. మూడు నెలల కిందట కిలో టమోటా ధర 10 పైసలు పలకడంతో.. పంటను పొలాలు, రోడ్లపై పడేశారు. ప్రస్తుతం జత టమోటా గంపలు రూ.1000 పలకడంతో కిలో టమోటా 30 నుంచి రూ.50 పలికింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారంరోజులుగా టమోటా ధరలు స్థిరంగా కొనసాగుతుండడంతో టమోటా రైతులకు మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నారు. పత్తికొండ వ్యవసాయ మార్కెట్ కు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున టమోటా సరుకు వచ్చి చేరుతుంది. రోజుకు 20 లారీల టమోటా పంట వచ్చి చేరుతున్నట్లు తెలుస్తుంది.
డిమాండ్ ఇలా…
కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమోటా ధరలకు రెక్కలు రావడంతో… ఆలూరు, డోన్, ఆదోని, కోడుమూరు ప్రాంతాల నుంచి టమోటాను ఇక్కడకు తరలిస్తారు. పత్తికొండ ప్రాంతంలో పండిన టమోటా పంటను తెలంగాణ ప్రాంతానికి అధికంగా ఎగుమతి చేస్తుంటారు . అయితే తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం వర్షాలు అధికమై పంట దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో టమోటా కు డిమాండ్ పెరిగింది. దీంతో ధరలకు రెక్కలొచ్చాయని చెప్పవచ్చు.