కూరగాయల ధరలు పెరగడానికి కారణమేంటో తెలుసా ?
1 min readపల్లెవెలుగు వెబ్ : కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యుడి జేబు గుల్లచేస్తున్నాయి. కొనేలా లేవు.. తినేలా లేవు అంటూ సామాన్యులు వాపోతున్నారు. దళారీ వ్యవస్థ కారణంగా ధరలు పెరిగిపోతున్నాయి. కిలో టమోటా ధర మెట్రో సిటీల్లో 72 రూపాయాలు పలుకుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహారాష్ట్రలోని నాసిక్, ఔరంగబాద్ జిల్లాల్లో టమోట పంట తీవ్రంగా దెబ్బతిన్నది. ఆంధ్ర, కర్ణాటకలో కూడ వర్షాలకు పంటలు దెబ్బతినడం, ఉన్న టమోట తెగుళ్ల బారినపడ్డ కారణంగా టమోట సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా డిమాండ్ పెరిగి ధరలు విపరీతంగా పెరిగాయి. టమోట ధరలతో పాటు మిగిలిన కూరగాయల ధరలు కూడ విపరీతంగా పెరిగాయి. ఉల్లి పంట మార్కెట్లోకి రావడం కొంత ఆలస్యం కానున్న నేపథ్యంలో ఉల్లిపాయ ధరలు కూడ పెరిగాయి. సరఫరా పెరిగితే తప్ప కూరగాయల ధరలు తగ్గే అవకాశం లేదు. మరోవైపు దళారులు కూడ రైతుల వద్ద నుంచి తక్కువకు కొనుగోలు చేసి.. అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. దీంతో సామాన్యుడికి చేరేసరికి ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది.