వైసీపీ దాడి ప్రాంతాల్లో చంద్రబాబు విస్తృత పరిశీలన!
1 min readపల్లెవెలుగువెబ్, విజయవాడ: విజయవాడ, మంగళగిరిలో వైసీపీ శ్రేణులు చేసిన దాడి ప్రాంతాలను టీడీపీ అధినేత చంద్రబాబు, తనయుడు లోకేష్ బుధవారం విస్తృతంగా పరిశీలించారు. ఈమేరకు దాడి జరిగిన టీడీపీ అధికార ప్రతినిది కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నివాసాన్ని, మంగళగిరిలోని టీడీపీ కార్యాలయాన్ని, దాడిలో గాయపడ్డ పార్టీ కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించారు. ఈ క్రమంలో పట్టాభి కుటుంబంతో దాడి జరిగిన తీరుపై ఆరా తీశారు. నివాసంలో ధ్వంసమైన వస్తుసామాగ్రిని పరిశీలించారు. అలాగే మంగళగిరి పార్టీ కార్యాలయంలో వైసీపీ దాడికి ధ్వంజసమైన వాహనాలు, భవనం అద్దాలు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఇంతటి అరాచక చర్యను ఎన్నడూ చూడలేదని, ప్రభుత్వం, పోలీసు కలిసి చేసిన టెర్రరిజమని అభివర్ణించారు. వైసీపీ గుండాలు వినియోగించిన కర్రలు, ఆయుధాలను చంద్రబాబు చూపించారు. రాష్ట్రంలో వైసీపీ చేస్తోన్న అరాచక దాడులను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో పతనం తప్పదని బాబు హెచ్చరించారు.