పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తాం..
1 min read– పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి సహకరిస్తాం..
– కర్నూలు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి ప్రభుత్వం తరపు నుండి అన్ని విధాల సహకరిస్తామన్నారు కర్నూలు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎంఎస్ఎంఈ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు మరియు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కమిటీతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం.కె.వి.శ్రీనివాసులు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి, ఎల్ డిఎం వెంకట్ నారాయణ, ఏపీఐఐసి జెడ్ ఎమ్ వెంకట నారాయణమ్మ, కుడా వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా అధికారులు, ఎంఎస్ ఎంఈ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రతినిధులు, డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ కె. రాజా మహేంద్రనాథ్, ఐలా చైర్మన్ జి.రామకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడానికి తగిన అనుమతులను నిర్దేశించిన గడువులోగా మంజూరు చేస్తామని, జిల్లా యంత్రాంగం నుంచి పరిశ్రమలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. బ్యాంకర్లు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆదేశించారు. ఐటీఐ, పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కళాశాలలలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పడం, ప్రభుత్వ సహకారం తదితర పారిశ్రామిక ప్రగతి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పరిశ్రమల అభివృద్ధితోనే జిల్లా ఆర్థికంగా మరింత పరిపుష్టి సాధించి యువతకు మెండైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందుతాయని, పరిశ్రమలు నెలకొల్పేందుకు యువతను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు.