కొత్త పింఛన్ ఇవ్వకపోగా… ఉన్నవి తొలగించడం అన్యాయం..!
1 min read– టీడీపీ సాంస్కృతిక విభాగం కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు పెనికలపాటి హనుమంతరావు చౌదరి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కళాకారులకు సంబంధించి కొత్త పింఛన్ ఇవ్వకపోగా.. ఉన్న పింఛన్లు తొలగించడం అన్యాయమన్నారు తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు పెనికలపాటి హనుమంతరావు చౌదరి. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా వల్ల ఏడాదిన్నరకుపైగా కష్టాలుపడుతున్న కళాకారుల కంఠ శోష ఎవరికీ పట్టదా..? సమాజ హితం కోరి తారతమ్య వర్గ భేదం లేకుండా అందర్నీ ఆనందింపచేయడానికే జీవితాలను ధారపోసిన కళాకారుల దుర్భర పరిస్థితులు ఇంకా ఎన్నాళ్లు.. ? అని ఆయన ప్రశ్నించారు. సమాజంలో అన్ని వృత్తుల వారికి ఏటా 10వేల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తున్న ప్రభుత్వం కళాకారులకు మాత్రం ఒక్క పైసా కూడా విదల్చలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కళాకారులు, వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని, తొలగించిన వాటిని కొనసాగించేలా చర్యలు తీసుకవాలని టీడీపీ సాంస్కృతిక విభాగం కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు పెనికలపాటి హనుమంతరావు చౌదరి కోరారు.