మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావొద్దు: జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు
1 min read
పల్లె వెలుగు వెబ్, కర్నూలు: యువత మాదకద్రవ్యాల పట్ల ఆకర్షితులు కారాదని కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంకేవీ శ్రీనివాసులు విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ వైద్య డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో జిల్లా యువజన సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వినియోగం – అనర్థాలు / దుష్పరిణామాలు అనే అంశంఫై అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ… చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని.. మంచి ఆరోగ్య అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. ఆరోగ్యకర జీవితంతో పాటు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
జిల్లా ఎక్సెైజ్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్, గుట్కా, నల్ల మందు తదితర మత్తు పదార్థాలను నిషేధించిందన్నారు. వీటిని సరఫరా చేసేవారిని కఠినంగా శిక్షించేందుకు NDPS చట్టం తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టం కింద అరెస్ట్ అయితే బెయిల్ రాదని హెచ్చరించారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ డాక్టర్ సలీం బాషా, రీజినల్ టెస్టింగ్ ల్యాబ్ క్లినికల్ మైక్రోబయాలజిస్ట్ కె.శ్రీనివాస రావు, సైకాలజిస్ట్ సుశృత్ రెడ్డి, సైక్రియాట్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్.ఇక్రమాల్లా తదితరులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మత్తు పదార్థాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలను వివరించారు. కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ భరత్ నాయక్, జిల్లా సెట్కూరు, ముఖ్య కార్య నిర్వహణాధికారి టి.నాగరాజ నాయుడు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జిక్కి పాల్గొన్నారు.