బోధించే వారిని.. బాధించొద్దు : STU
1 min readపల్లెవెలుగు వెబ్, కడప: బోధనలో నిమగ్నం కావాల్సిన టీచర్లను.. బోధనేతర పనులతో ఇబ్బంది పెట్టడం మానుకోవాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (STU) డిమాండ్ చేసింది. కోడిగుడ్లు ,చిక్కీల పంపిణీలో జాప్యం జరిగిందనే కారణంతో రాయలసీమ జిల్లాల్లోని ప్రధానోపాధ్యాయులు, టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సోమవారం ఉదయం కడప ఆర్జెడి కార్యాలయం ముందు STU మెరుపు ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. ఆందోళన కార్యక్రమంలో చిత్తూరు,కడప,కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి STU ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా… అధికారులు, ఉపాధ్యాయులకు జారీచేసిన షోకాజ్ నోటీసులు ఉపసంహరించుకోవాలని నినదించారు. బోధనకు ఆటంకం కల్పిస్తున్న వివిధ రకాల యాప్ లను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల తప్పిదాలకు MEO,HM, టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం సమంజసం కాదన్నారు. వీటిని ఉపసంహరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, STU అండగా ఉంటుందని తెలిపారు. స్కూల్ లో అడుగు పెట్టినప్పటి నుండి నానా రకాల యాప్ లలో ఫోటోలు, సమాచారం పంపడానికి సమయం సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బోధనేతర పనుల వలన టీచర్లు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారన్నారు. వేల కోట్ల రూపాయలు వెచ్చించి నాడు– నేడు లాంటి పథకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారినప్పటికీ, ఉపాధ్యాయుల కొరత వల్ల, ఉన్న ఉపాధ్యాయులకు బోధనేతర పనుల వల్ల అసలు లక్ష్యం నీరుగారుతోందన్నారు. కార్యాలయ పనుల నిమిత్తం RJD గారు విజయవాడలో వుండడంతో.. A.D గారికి STU నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా RJD గారు ఫోన్లో STU నాయకులతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ఎవరికీ ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.