పల్లెవెలుగు వెబ్:దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పే ప్రమాదం లేదని, ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ప్రకటిత అంచనా 5.3 శాతం స్థాయిలోనే ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు ధరల ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడనుందని చెప్పారు. ఆహార ధరల ద్రవ్యోల్బణం ఇప్పటికే అదుపులోకి వచ్చిందని, కీలక వస్తువుల ద్రవ్యోల్బణం మాత్రం ఇంకా గరిష్ఠ స్థాయిలోనే ఉందన్నారు. బిజినెస్ స్టాండర్డ్ ఆధ్వర్యం లో బుధవారం జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. సరఫరా అవాంతరాల కారణంగానే ద్రవ్యోల్బణం ఎగబాకిందని, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందన్నారు.