భక్తులతో మర్యాదగా నడుచుకోండి.. : ఈఓ లవన్న
1 min readపల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల పుణ్యక్షేత్రంకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారని, భక్తులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని ఆలయ సిబ్బందిని ఆదేశించారు ఈఓ లవన్న. ఆదివారం కల్యాణకట్టను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ క్షురకులు భక్తుల నుంచి ఎలాంటి మొత్తాన్ని స్వీకరించకూడదన్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. భక్తులు కేవలం కేశఖండన టికెట్టును మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. కల్యాణకట్టను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, కోవిడ్ నిబంధనలను తప్పకుండ పాటించాలని సూచించారు. తలనీలాలు తీసే పరికరాలను ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తతో శుభ్రపరుస్తుండాలన్నారు.ముఖ్యంగా కల్యాణకట్టలో భక్తులు భౌతిక దూరం పాటించడం పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. అదేవిధంగా కేశఖండన కౌంటరును కూడా తనిఖీ చేసారు. ఈ పరిశీలనలో సహాయ కార్యనిర్వహణాధికారి పి. నటరాజరావు, పర్యవేక్షకులు శివప్రసాద్, కల్యాణకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.