మూడు రాజధానులతోనే.. రాష్ట్రాభివృద్ధి : ఎంపీ డా. సంజీవ్ కుమార్
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: మూడు రాజధానులతోనే ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి సాధ్యమన్నారు ఎంపీ డా. సంజీవ్ కుమార్. సోమవారం కర్నూలు నగరంలోని మెగా సిరి ఫంక్షన్ హాల్లో అధికార వికేంద్రీకరణ పరిరక్షణ సమితి కర్నూలు జిల్లా వారి మూడు రాజధానులు ఏర్పాటు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కర్నూల్ రాజధాని ఉన్న సమయంలో కొంతమంది రాజకీయ లబ్ధి కోసం హైదరాబాద్ కు తరలించారని, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మూడు రాజధానులను వ్యతిరేకించడం సిగ్గుచేటన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు 5 వేల ఎకరాలు దానమిచ్చి.. తెలుగు రాష్ట్రాలకు తాగు,సాగునీరు అందిస్తున్న కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటిస్తే… జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు పేడ్ ఆర్టిస్టులతో పాదయాత్ర చేయిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మూడు రాజధానుల కు మద్దతు తెలిపి రాయలసీమ రుణం తీర్చుకోకపోతే భవిష్యత్తులో రాయలసీమ ప్రాంతంలో మీరు తిరగలేరని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, డా. సుధాకర్, మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.