కంగనాపై దేశద్రోహం కేసుపెట్టే దమ్ముందా?: అసదుద్దీన్ ఓవైసీ
1 min read
పల్లెవెలుగు వెబ్: బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్.. ఇటీవల దేశ స్వాతంత్ర్యంపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తాజాగా ఈ వ్యవహారంపై మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఇటీవల భారత అత్యున్నత పురస్కారం అందుకున్న ఓ నటి.. మనకు స్వాతంత్ర్యం 2014లో వచ్చింది అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ వ్యాఖ్యలే ఓ ముస్లిం అని ఉంటే.. ఇప్పటికే అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేసి, మోకాళ్లపై కాల్పులు జరిపి, జైలుకు పంపేవారని అసద్ వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలు చేసింది ఓ రాణి అని.. ఆమెను మాత్రం ఏమీ చేయలేరు అని అన్నారు. ఇటీవల ఇండియాపై పాక్ జట్టు గెలవడంతో సంబరాలు చేసుకున్న వ్యక్తులపై దేశ ద్రోహం కేసు పెట్టారని.. మరీ కంగనాపై కూడా ఆ కేసులు పెట్టే దమ్ముందా అని యూపీ సీఎం యోగిని సూటిగా ప్రశ్నించారు ఓవైసీ. ఇంతకీ మనకు స్వాతంత్ర్యం 1947లోనా లేక 2014లో వచ్చిందో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగినే చెప్పాలని అసదుద్దీన్ ఓవైసీ చమత్కరించారు.