బీహార్‌లో సంచలన ఘటన.. గజగజ వణికిన న్యాయమూర్తి
1 min read
పల్లెవెలుగువెబ్: బీహార్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఓ కేసును విచారణ చేస్తున్న న్యాయమూర్తిపై దాడి చేసి తుపాకి గురిపెట్టారు ఇద్దరు పోలీసులు. ఈ ఘటన మధుబని జిల్లా కోర్టులో చోటుచేసుకుంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన పాట్నా హైకోర్టు స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. తమ ప్రేమేయం ఉన్న కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో జాన్‌జహాపూర్ కోర్టు హాలులోకి ప్రవేశించిన ఇద్దరు పోలీసులు… అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అవినాశ్ కుమార్‌పై తుపాకి గురిపెట్టి దాడి చేశారు. దీంతో షాక్ గురైన న్యాయమూర్తి గజగజ వణికిపోయారు. కొద్దిసేపు వరకు షాక్ నుంచి తేరుకోలేకపోయారు. న్యాయమూర్తిని కాపాడేందుకు యత్నించిన లాయర్లు, కోర్టు ఉద్యోగులపైనా నిందితులైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గోపాల్‌కృష్ణ, ఎస్సై అభిమన్యు కుమార్ దాడి చేశారు.
ఈ ఘటనపై పాట్నా హైకోర్టు స్పందించింది. ఇది ఒక అసాధారణ, షాకింగ్’ ఘటనగా జస్టిస్ రాజన్ గుప్తా, మోహిత్ కుమార్ షా ధర్మాసనం అభివర్ణించింది. ఈ నెల 29న సీల్డ్ కవర్‌లో స్టేటస్ రిపోర్టు సమర్పించాలని డీజీపీని ఆదేశించడమే కాక, స్వయంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఇటువంటి ఘటనలు న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రమాదంలో పడేస్తాయని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.