వివాదరహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతాం… : సీనియర్ సివిల్ జడ్జి శ్రీ విద్య
1 min read–నేటి నుండి ఇంటి వద్దకే ఉచిత న్యాయ సేవలు..
పల్లెవెలుగువెబ్, నందికొట్కూరు: నందికొట్కూరు తాలూకా కోర్టు పరిధిలోని గ్రామాలను వివాద రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతామని, ఇంటింటికి ఉచిత న్యాయ సేవలను అందించడమే ద్యేయంగా మండల న్యాయ సేవా సాధికార సంస్థ కృషి చేస్తుందని నందికొట్కూరు సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవా సాధికార సంస్థ చైర్మన్ శ్రీవిద్య అన్నారు. నవంబర్ 21నుంచి డిసెంబరు 31 వరకు నందికొట్కూరు కోర్టు పరిధిలోని 51 గ్రామాలలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.శనివారం కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జాతీయ న్యాయ సేవ సాధికార సంస్థ పరిధిలో పనిచేస్తున్న మండల న్యాయ సేవా సాధికార సంస్థ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకోనేందుకు న్యాయ వాదులు 5 బృందాలుగా ఏర్పడి గ్రామాలలో పర్యటిస్తారన్నారు.
ఈ బృందంలో న్యాయవాదులు, పారా లీగల్ వాలంటరీలు, పోస్టల్ శాఖ సిబ్బంది,పోలీసు సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలు ఉంటారన్నారు.ఈ బృందం సభ్యులు గ్రామాల్లో పర్యటించి ఇంటి సభ్యుల వివరాలు తెలుసుకొని, వారి కుటుంబాలలోని సమస్యలు తెలుకుంటారు.రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటరు నమోదు, పింఛన్లు, ,మరణ, జనన ధ్రువీకరణ పత్రాలు మంజూరు వంటి సమస్యలను ఆయా శాఖల అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.కోవిడ్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలంటే కోవిడ్ టీకా ఎవరు వేయించుకున్నారు, ఎవరు వేయించుకోలేదో వివరాలు సేకరించి వైద్యాధికారులకు జాబితాను అందజేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.ప్రతి ఇంటికి న్యాయ సేవా సంస్థ టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను ఉచితంగా పరిష్కరించుకోవచ్చు అని తెలిపారు.ఎవరికి ఏ సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నంబర్ నుంచి ఫోన్ చేయవచ్చన్నారు. గ్రామాలలో ప్రజలు చిన్నచిన్న గొడవలకు పాల్పడకుండా ప్రశాంతంగా జీవించాలంటే ఉచిత న్యాయ సేవా సాధికార సంస్థ సేవలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి తిరుమల రావు, న్యాయవాదులు సత్యనారాయణ, వెంకట రాముడు, భాస్కర్, స్వామిరెడ్డి, వెంకట రమణ, కొంగర వెంకటేశ్వర్లు,పాలూరి శ్రీనివాసులు ,సిబ్బంది ఉమాదేవి, మహేశ్వరి, పట్టణ ఎస్ఐ ఎన్వి రమణ పాల్గొన్నారు.