మరింత మెరుగుపర్చేందుకే రద్దు: సీఎం జగన్
1 min read
పల్లెవెలుగు వెబ్: మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై సీఎం జగన్ అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. వికేంద్రీకరణ బిల్లును మరింత మెరుగుపర్చేందుకే రద్దు చేస్తున్నామని సీఎం ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా ఉంటే.. గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారని.. అనంతరం ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడినప్పుడు రాజధాని, హైకోర్టును హైదరాబాద్ కు తరలించారని పేర్కొన్నారు. ‘ శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు న్యాయం జరగాల్సిందే. అమరావతి ప్రాంతంపై నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు.. నా ఇల్లు కూడా ఇక్కడే ఉంది. అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పించాలంటే.. ప్రతి ఎకరాకు రూ.2కోట్లు ఖర్చు అవుతుంది. ఆ లెక్కనా 50 వేల ఎకరాలకు రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతుంది. ఏవిధంగా చూసినా.. అమరావతిలో కనీసం రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి బడ్జెట్ సరిపోదు. ఇవ్వని తెలిసి కూడా గత ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించడం సమంజసమేనా? మనకు, మన పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? పెద్ద నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు వెళ్లాల్సిందేనా’ అని సీఎం జగన్ ప్రశ్నించారు.
ప్రస్తుతం మన రాష్ట్రంలో విశాఖ అతిపెద్ద నగరమని.. అక్కడ అన్నీ వసతులు ఉన్నాయన్నారు సీఎం జగన్. అదనంగా హంగులు దిద్దితే వచ్చే ఐదు, ఆరేళ్లలో హైదరాబాద్‌తో పోటీ పడే అవకాశం ఉంటుందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. వికేంద్రీకరణపై అనేక అనుమానాలు, అపోహలు సృష్టించారు. చివరకు కోర్టులో కూడా కేసులు వేశారని.. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులకు సంబంధించి ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్ట, న్యాయపరంగా అన్ని సమాధానాలను బిల్లులోనే పొందు పరిచేందుకు, మరింత మెరుగు పరిచేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లు వెనక్కి తీసుకుంటున్నామని సీఎం ప్రకటించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని త్వరలోనే పూర్తి సమగ్ర, మెరుగైన బిల్లును సభలో మరోసారి ప్రవేశపెడతామని సీఎం జగన్ వివరించారు.