మరోసారి వెనక్కి తగ్గిన జగన్ సర్కార్
1 min read
పల్లెవెలుగు వెబ్: ఏపీ ప్రభుత్వం మరోసారి వెనక్కి తగ్గింది. శాసన మండలి రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు మంత్రి బుగ్గన తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత కొంత కాలం నుంచి మండలి విషయంలో సందిగ్ధం నెలకొందని.. అయితే ఇప్పుడు దాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి బుగ్గన వెల్లడించారు. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నప్పుడు.. అవి త్వరగా చట్టం కావాలనే ఉద్దేశం ఉంటుందన్నారు. అయితే అనివార్య కారణాలతో చట్ట రూపం దాల్చలేదని… ఎప్పుడైనా ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు సుప్రీం అన్నారు.
‘‘ శాసన సభలోనూ ఉన్నత విద్యావంతులు ఉన్నారు. వారికి అన్ని విషయాలపై అవగాహన ఉంది. అయితే శాసన మండలి కేవలం చర్చించి సలహాలు ఇవ్వడానికి మాత్రమే ఉంది. అప్పటి పరిస్థితుల కారణంగా జనవరి 27, 2020న కౌన్సిల్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేశాం. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వానికి, హోమ్ మినిస్టరీకి సమాచారం అందించాం. కానీ, ఇప్పటి వరకు అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శాసనమండలిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’’ అని బుగ్గన అసెంబ్లీలో వివరించారు. కాగా, శాసనమండలి రద్దు ఉపసంహరణ తీర్మానాన్ని శాసన సభ ఆమోదించింది.