ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ.. ఆదుకోవాలని విజ్ఞప్తి
1 min read
పల్లెవెలుగు వెబ్: భారీ వర్షాలతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని..కష్టాల నుంచి గట్టెక్కడానికి తక్షణ సాయంగా రూ.1000 కోట్లు మంజూరు చేయాలని సీఎం జగన్ కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాకు వేర్వేరుగా లేఖలు రాశారు. వరద నష్టాన్ని అంచనా వేయడానికి ఓ బృందాన్ని కూడా పంపాలని కేంద్రానికి సీఎం విజ్ఞప్తి చేశారు. ‘‘ కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో గతంలో మునుపెన్నడూ లేనివిధంగా 255 శాతం మేర అధిక వర్షపాతం నమోదైంది. అక్కడక్కడ 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో తిరుపతి, తిరుమల, మదనపల్లె, నెల్లూరు, రాజంపేట తదితర ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. 196 మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రధానంగా ఆ నాలుగు జిల్లాలో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. చెరువులకు గండ్లు ఏర్పడ్డాయి’’. దీంతో యుద్ధప్రాతిపదికన మరమతులు చేయడానికి తక్షణ సాయం కింద రూ.1000 కోట్లు మంజూరు చేయాలని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు.