సమన్వయమే భారతీయం..
1 min read-స్వామిని ప్రతిష్ఠానంద సరస్వతి మాతాజీ
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: భారతీయ తాత్విక చింతన ఆసేతు హిమాచల పర్యంతం అందరినీ ఏకోన్ముఖంగా కలిపి ఉంచుతుందని, వసుధైక కుటుంబకమనే భావన , భిన్నత్వంలో ఏకత్వం ఇవన్నీ మనకు భారతీయ సంస్కృతి నుండి వస్తున్న తరతరాల సంపదని చిన్మయ మిషన్ అనంతపురం జిల్లా శాఖ బాధ్యులు స్వామిని ప్రతిష్టానంద సరస్వతి మాతాజీ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుండి నందవరం మండలం, గురజాల గ్రామం లోని శ్రీరామ లింగేశ్వర స్వామి దేవస్థానం నందు జరుగుతున్న ధార్మిక ప్రవచనాలు, భజనలు, గోపూజ, కుంకుమార్చన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. మూడు రోజుల పాటు మాతాజీ రామాయణ, భారత, భగవధ్గీత ప్రవచనం చేశారు. శుక్రవారం ఉదయం గోవును పూజించి, నగరంసంకీర్తనలతో ఊరేగింపు నిర్వహించారు.
ఈసందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యఫలం గోవులకు సేవచేస్తే కలుగుతుందని,గోజాతి రక్షణకోసం తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని అన్నారు. తర్వాత అర్చకులు హంపి స్వామిచే కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ పెద్దలు అందరు కలిసి భక్తులందరికీ అన్నసంతర్పణ చేయడంతోపాటు ధార్మిక ప్రతినిధులను ఘణంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పరమేశ్ ,ఆలయ పూర్వ ధర్మకర్త నరసింహ రెడ్డి, అర్చకులు హంపి స్వామి, గ్రామ పెద్దలు రాజారెడ్డి, నరసింహులు, కేశన్న, నరసప్ప, శ్రీరాములు, అడ్వకేట్ ఉరుకుందు, ఎమ్మిగనూరు హిందూ చైతన్య వేదిక అధ్యక్షులు కరణం రవి, ఎమ్మిగనూరు గీతా మందిర్ కార్యదర్శి ఉరుకుందప్ప, సిద్దం రవికుమార్ రెడ్డి, శ్రీవారి సేవకులు గురురాజ, రాజశేఖర్, మల్లిఖార్జున, వీరేశ్, శ్రీధర్ స్వామి, డి.పద్మజ,పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.