క్రిప్టో కరెన్సీతో ముప్పు : ఆర్బీఐ మాజీ గవర్నర్
1 min readపల్లెవెలుగు వెబ్: క్రిప్టో కరెన్సీ పై ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. క్రిప్టో కరెన్సీని అనుమతిస్తే ద్రవ్య, పరపతి విధానాలపై ఆర్బీఐ పట్టుకోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. నగదు సరఫరా, ద్రవ్యోల్బణ నిర్వహణ అదుపు తప్పుతాయన్నారు. ఎన్ఎస్ఈ, న్యూయార్క్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక వెబినార్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతిమ రుణదాతగా ఆర్‌బీఐకి ఉన్న ప్రాధాన్యతను దిగజార్చడం ఏమాత్రం మంచిది కాదన్నారు. డిజిటల్ చెల్లింపులకు పెరుగుతున్న ఆదరణతో మన దేశంలోనూ కరెన్సీ నోట్లకు కాలం చెల్లుతోందని సుబ్బారావు అన్నారు. కొవిడ్‌తో తలెత్తిన లాక్‌డౌన్ల కారణంగానే ఇటీవల దేశంలో కరెన్సీ నోట్ల చలామణి పెరిగిందన్నారు. పటిష్ఠమైన డేటా పరిరక్షణ చట్టాలు ఉంటే తప్ప.. ఆర్‌బీఐ తన సొంత డిజిటల్ కరెన్సీకి వెళ్లడం మంచిది కాదన్నారు.