అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: కేఈ శ్యాంబాబు
1 min readపల్లెవెలుగు వెబ్, పత్తికొండ: అధికార పార్టీ ప్రతిపక్షాలపై చేసే దాడులు, అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు టిడిపి పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి కేఈ శ్యాంబాబు. ఆదివారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారం ఉంది కదా అని వైసిపి నేతలు అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ నేతలు చేసే అక్రమ అరాచకాలను దీటుగా ఎదుర్కొంటామని తెలిపారు. తమ పార్టీ శ్రేణులపై వైసిపి నేతలు దాడులకు పాల్పడడం రివాజుగా మారిందన్నారు. పత్తికొండ నియోజకవర్గం లో ఎమ్మెల్యే అనుచరులు చేసే అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని వాపోయారు. పత్తికొండ కు తలమానికంగా ఉన్న పార్వతి కొండను నామరూపాల్లేకుండా చేస్తున్నారని, వైసీపీ నాయకులు రియల్ వ్యాపారుల అవతారమెత్తి ఇష్టానుసారంగా ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను గుట్టలను ప్రభుత్వ పరం పోగులను కబ్జా చేసి జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. పత్తికొండ చరిత్రకు సాక్ష్యంగా ఉన్న పార్వతి కొండలో స్థానిక ఎమ్మెల్యే అండతో ఎర్ర మట్టి తవ్వకాలు చేస్తున్నారని , వైసీపీ చేస్తున్న తవ్వకాలను నిరూపించడానికి పర్యటనకు వస్తున్న రాష్ట్ర టిడిపి నిజనిర్ధారణ కమిటీ సభ్యులను హౌస్ అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు. స్థానికంగా తమపై పోలీసులు ఆంక్షలు విధించడం విడ్డూరమని అన్నారు. పత్తికొండ కు వస్తున్న నిజ నిర్ధారణ కమిటీ నాయకులను వైసిపి అండతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన ఖండించారు.