‘ఆటిజం’ పై అపోహలు వద్దు: డా. నవీద్
1 min read– కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలులో ప్రత్యేక కార్యక్రమం
– పిల్లల ఎదుగుదలకు ప్రత్యేక చిట్కాలు
– ఆలరించిన ఆటిజం పిల్లల నృత్యాలు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ఆటిజం ఉన్న పిల్లల అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు. ఈ కార్యక్రమం ద్వారా ఆటిజంతో ఉన్న పిల్లలపై వస్తున్న ఆపోహాల గురించి పిల్లల తల్లిదండ్రులకు వివరించారు డాక్టర్లు. గురువారం కిమ్స్ హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఆటిజంతో ఉన్న పిల్లలు జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. అనతరం పీడియాట్రిక్స్ డాక్టర్. గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ ఆటిజంతో పుట్టిన పిల్లలపై సమాజంలో చిన్న చూపు ఉంటుందని, ఆ పరిణామాలు వారిపై పడకుండా ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచించారు. డాక్టర్ నవీద్ మాట్లాడుతూ ఆటిజంతో పుట్టిన పిల్లలను ఎలా స్క్రీనింగ్ చేయాలి, వారికి ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటిని అధిగమించడం ఎలా అనే అంశాలను వివరించారు. నెలలు నిండక ముందు జన్మించిన శిశువుల్లో ఎలాంటి సమస్యలు వస్తాయి వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. ఏ ఆహారం ఇవ్వాలి, ఏ వయస్సులో స్క్రీనింగ్ అవసరాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఆధునిక వైద్యంలో ఆటిజం ఉన్న పిల్లల అభివృద్ధి రేటు నానాటికి పెరుగుతుందని, కిమ్స్ హాస్పిటల్స్‌లోని చైల్డ్ డెవలప్‌మెంట్ విభాగం ఇందుకు కృషి చేస్తోందని తెలిపారు.
అనంతరం బెంగళూరు నుండి వచ్చిన డాక్టర్. రాఘవరాజు అన్చెల్లి మాట్లాడుతూ ఆటిజం, ఏడిహెచ్‌డి మీద అవగాహన కల్పించారు. ఆటిజం యొక్క లక్షణాలు, పిల్లల ప్రవర్తన వారికి ఎటువంటి స్క్రీనింగ్ అవసరాలు ఉంటాయో తెలిపారు. జబ్బు తీవ్రత తెలుసుకొని పిల్లలకు ఎలాంటి చికిత్సలు చేయించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.
ఆ తరువాత ఫిజియోథెరపిస్ట్ సయ్యద్ అర్షద్ ఆయూబ్ మాట్లాడుతూ ఒకటి నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లల అభివృద్ధిలో ఎలాంటి లోపాలు ఉంటాయో వివరించారు. అలాగే ఎలా అధిగమించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమం చివర్లో ఆటిజం ఉన్న పిల్లలు ఆధునిక పాటలు నృత్యాలు చేయడం అందరినీ ఆకట్టుకున్నాయి. సాధారణ పిల్లలతో పాటు ఆటిజం ఉన్న పిల్లలు దేనిలోనూ తీసిపోరని, ఇందుకు ఈ నృత్యాలే నిదర్శనమని డాక్టర్ నవీద్ పేర్కొన్నారు. బెంగళూరు నుండి వచ్చిన డాక్టర్ రాఘవకు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డా. సుధాకర్, డా. గోవర్థన్ రెడ్డి, డా. రఫీక్. సీఓఓ రంజీత్ రెడ్డి, ఆటిజం పిల్లల ప్రఖ్యాత శిక్షకురాలు మేఘవతితో పాటు ఆటిజంతో ఉన్న పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.