పల్లెవెలుగువెబ్, కర్నూలు: ప్రజల దగ్గరగా ఉంటూ మెరుగైన సేవలఅందించడంతో పాటు సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు సచివాలయ ఉద్యోగులకు సూచించారు. శుక్రవారం కర్నూలు మండలం నిడ్జూరు గ్రామ సచివాలయం మరియు మునగాల పాడు వార్డు సచివాలయంను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్ లు తదితర వాటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నిడ్జూరు గ్రామ సచివాలయం ఎదురుగా డ్రైనేజీ ఉండటంతో వెంటనే క్లీన్ చేయాలని పంచాయితీ కార్యదర్శిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
మునగలపాడు వార్డు సచివాలయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై సరైన సమాధానం ఇవ్వకపోవడంతో జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ పక్రియలో భాగంగా మీ సచివాలయం పరిధిలో ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇంకా ఎంతమందికి వ్యాక్సిన్ ఇవ్వాలి వంటి వివరాలు అడిగి తెలుసుకొని వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సచివాలయ ఏఎన్ఎంను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా విస్తృత అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆదేశించారు.